ఢిల్లీ, ముంబై తర్వాత ఇక్కడే ఎక్కువ కేసులు 

NCRB Report 2020: Hyderabad Ranks Third In Financial Related Crimes - Sakshi

అతివలపై దారుణాల్లో సిటీది ఐదో స్థానం

స్పష్టం చేస్తున్న ఎన్సీఆర్బీ–2020 గణాంకాలు

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2020 సంవత్సరానికి సంబంధించిన జాతీయ స్థాయి గణాంకాలు విడుదల చేసింది. 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 19 నగరాలను పోల్చినప్పుడు హైదరాబాద్‌ నగరం ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో మూడో స్థానంలో ఉంది. అలాగే మహిళలపై జరిగే నేరాల్లో ఐదో స్థానం, కిడ్నాప్‌ కేసుల నమోదులో ఏడో స్థానంలో నిలిచినట్లు ఎన్నీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క నగరంలో 2018 నుంచి హత్య కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వీటితో అత్యధికం వివాదాల నేపథ్యంలో జరిగినవే. హత్యకు గురైన వారిలో 18–30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హత్య కేసుల విషయంలో హైదరాబాద్‌ 11వ స్థానంలో ఉంది.

►ఆర్థిక నేరాలకి వస్తే.. నగరంలో 2020 సంవత్సరంలో మొత్తం 3,427 కేసులు నమోదయ్యాయి. 4,445 కేసులతో ఢిల్లీ, 3,927 కేసులతో ముంబై రెండో స్థానంలో ఉన్నాయి. వీటిలో ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్‌ కేసులే 3,307 ఉన్నాయి.
 
►సైబర్‌ నేరాల నమోదులో నగరానికి రెండో స్థానం. ఇక్కడ 2018లో 428, 2019లో 1379 కేసులు నమోదయ్యాయి. గతేడాది విషయానికి వచ్చేసరికి ఈ సంఖ్య అమాంతం 2553కు చేరింది. వీటిలో ఫ్రాడ్‌ కేసులు 2020 ఉండగా వాటిలో బ్యాంకింగ్‌ ఫ్రాడ్స్‌ 1366.  

►మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో హైదరాబాద్‌ ఐదో స్థానంలో ఉంది. 9,782 కేసులతో ఢిల్లీ, 4583 కేసులతో ముంబై, 2730 కేసులతో బెంగళూరు, 2636 కేసులతో లక్నో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.  

►నగరంలో నమోదైన కేసుల్లో భర్తలు చేసిన దాషీ్టకాలకు సంబంధించినే 1226 కేసులు ఉన్నాయి. మిగిలిన వాటిలో 21 వరకట్న చావులు, 17 ఆత్మహత్యకు ప్రేరేపించడాలు, 131 కిడ్నాప్‌లు నమోదయ్యాయి.
 
► 4011 కిడ్నాపులతో దేశ రాజధాని మొదటి స్థానంలో ఉంది. 1173 కేసులతో ముంబై రెండు, 735 కేసులతో లక్నో మూడో స్థానంలో ఉండగా... 451 కేసులతో హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం.  

► కిడ్నాప్‌ బాధితుల్లో మైనర్లకు సంబంధించినవి 95 ఉదంతాలు నమోదు కాగా... వీరంతా బాలికలే కావడం గమనార్హం. మొత్తం 451 ఉదంతా ల్లోనూ 352 కేసులు బాలికలు, మహిళలకు సంబంధించినవే.   

►నగరంలో 2018లో 81, 2019లో 86 హత్యలు జరగ్గా... 2020లో ఆ సంఖ్య 71గా నమోదైంది. వీటిలో వ్యక్తిగత కక్షల వల్ల 10, సొత్తు కోసం 4, ప్రేమ వ్యవహారాలతో 3 హత్యలు జరిగాయి. అత్యధికంగా 39 ఉదంతాలు విభేదాల కారణంగా జరిగాయి. 

►హతుల్లో పురుషులు 63 మంది, స్త్రీలు 8 మంది ఉన్నారు. అత్యధికంగా 18–30 ఏళ్ల మధ్య వయసు్కలు 41 మంది ఉండగా... వీరిలో 35 మంది పురుషులు, ఆరుగురు స్త్రీలు.  

►చిన్నారులపై నేరాలకు సంబంధించి నగరంలో 467 కేసులు నమోదు కాగా... ఇతర నగరాలతో పోలిస్తే 11వ స్థానంలో ఉంది. వీటిలో 318 ఉదంతాలతో పోక్సో యాక్ట్‌ కేసులో అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత 95 కేసులు కిడ్నాప్‌లకు సంబంధించినవి.  

►2020లో నగర పోలీసులు వివిధ క్రిమినల్‌ కేసులకు సంబంధించి మొత్తం 4,855 మందిని అరెస్టు చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top