బాబుకు వెయ్యి.. పాపకు రూ.800.. కాన్పుకు రూ.4వేలు! ప్రభుత్వ సాయం అనుకున్నారా?

Nalgonda MCH Staff Collect Money For Labouring Women Full Story Here - Sakshi

నల్లగొండ పట్టణ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రాములమ్మ (పేరుమార్చాం) తన కోడలిని కాన్పు కోసం వారం క్రితం ఎంసీహెచ్‌కు తీసుకొచ్చింది. వచ్చీరాగానే ఆపరేషన్‌ థియేటర్‌కు వీల్‌చైర్‌లో తీసుకెళ్లేటప్పుడు రూ.200 అడగడంతో సరేలే అని ఇచ్చింది. ఆపరేషన్‌ పూర్తయ్యాక ఆడపిల్ల పుట్టిందని తీసుకొచ్చి చూపించినందుకు రూ.800 వసూలు చేశారు. చీరె మార్చినందుకు రూ.200, వార్డుకు తీసుకొచ్చినందుకు రూ.300 అడగడంతో వెంటనే ఇచ్చేసింది. వారం రోజులు ఆస్పత్రిలోని వార్డులో ఉండడంతో వార్డు ఊడ్చిన వాళ్లకు రోజూ వంద చొప్పున రూ.800, మందులకు రూ.700, డిశ్చార్జ్‌ సమయంలో వార్డులో అందరికీ కలిపి రూ.700 సమర్పించుకుంది. ఇంటికొచ్చే సరికి మొత్తం రూ.3,700 ఇవ్వాల్సి వచ్చిందని వాపోయింది. ఇదీ ఎంసీహెచ్‌లో వసూళ్ల పర్వానికి ఉదాహరణ.

నల్లగొండ టౌన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో కాన్పుల వార్డులో పనిచేస్తున్న సిబ్బంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కాన్పులకు వచ్చినవారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి దండుకుంటున్నారు. వసూలు చేసిన డబ్బులు ఆ వార్డులోని సిబ్బంది సమానంగా పంచుకుంటున్నారు. కాసుల పంట పండిస్తున్న కాన్పుల వార్డులో డ్యూటీ కోసం సిబ్బంది పోటీ పడుతున్నారు. స్టాఫ్‌ నర్సు దగ్గరి నుంచి వార్డుబాయ్, ఆయా, ఇతర సహాయ సిబ్బంది అక్కడ డ్యూటీ వేసుకోవడానికి పైరవీలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో వసూళ్ల పర్వం కొనసాగుతుందో స్పష్టమవుతుంది. ఈ వసూళ్లకు భయపడి పేదలు ఆస్పత్రిలోని కాన్పుల వార్డులో చేరడానికి జంకుతున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు హెచ్చరించినా సిబ్బందిలో మార్పు రావడం లేదు. 

ఇంటికి వేళ్లే వరకు రూ.4 వేలు ఖర్చు
మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గించడానికి ప్రతి గర్భణి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం వైద ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు ఉచితంగా వైద్య సేవలను అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని, ఉచిత మందులను అందించి వెళ్లేటప్పుడు బాట ఖర్చులను అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది కాన్పులు కోసం జీజీహెచ్‌కు వస్తున్నారు. కానీ ఇక్కడి సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాన్ని తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు.

వార్డులో గర్భిణి అడ్మిట్‌ అయిన దగ్గరి నుంచి వసూళ్ల పర్వం మొదలవుతోంది. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే వారినుంచి ఈసడింపులు, వేధింపులను భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. పేరుకే ప్రభుత్వ ఆస్పత్రి కానీ కాన్పు జరిగి ఇంటికి వెళ్లే వరకు సుమారు. రూ.4 వేల వరకు ఖర్చవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల పర్వాన్ని అరికట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లచ్చూని వివరణ కోరడానికి ఫోన్‌లో 
ప్రయత్నించగా లిఫ్ట్‌ చేయలేదు.

మందులూ బయటి నుంచే..
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని కాన్పుల కోసం వచ్చే వారికి బయటి నుంచే కొన్ని మందులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రక్త పరీక్షల దగ్గరినుంచి కాన్పు జరిగే వరకు సిరంజీలు, సెలెన్‌ బాటిళ్లు, ఇతర మందులు బయట కొనుగోలు చేయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మందులు అందుబాటులో లేవని  సమాధానం చెపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో మందులు అందుబాటులో లేనప్పుడే.. బయటికి రాస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. 550 పడకల స్థాయి మెడికల్‌ కళాశాల అనుబంధంగా పనిచేస్తున్న జనరల్‌ ఆస్పత్రిలో మందుల కొరతను లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

మందులు బయట కొనమని రాసిచ్చారు
మందులు అందుబాటులో లేవని చెప్పి బయట కొనుక్కొని తీసుకురమ్మని చెప్పారు. చేసేది లేక బయట డబ్బులు పెట్టి మందులు కొన్నాను. పేరుకే  ప్రభుత్వ ఆస్పత్రి కానీ మందులు కూడా ఇవ్వడం లేదు. బయటికి రాస్తున్నారు. 
– మంగమ్మ , బోడంగిపర్తి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top