పీవీ ప్రపంచ మేధావి: శశి థరూర్‌

MP Shashi Tharoor Speak On PV Narasimha Rao Foreign Policy - Sakshi

సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విదేశీ విధానాలపై ఇందిరాభవన్‌లో ఆదివారం వెబ్‌నార్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్‌ పాల్గొని ప్రసంగించారు. శిశిథరూర్‌ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం విషయంలో పీవీ నర్సింహరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు చేసుకొని, విదేశాంగ విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇరాన్‌తో పటిష్టమైన బంధం ఏర్పరిచారని, దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు లుక్ ఈస్ట్, లుక్ వెస్ట్ పాలసీ రూపొందించారని చెప్పారు. (ఎన్‌ఎస్‌యూఐ దీక్ష విరమణ)

చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు అనేక వ్యూహాలు రచించి, కమ్యూనిజం నుంచి క్యాపిటలిజం వైపు వేగంగా అడుగులు వేశారని వ్యాఖ్యానించారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచి, రాజీవ్ గాంధీ అడుగు జాడల్లో నడిచి ఆర్థికంగా దేశాన్ని పటిష్టమైన స్థానానికి చేర్చారని అన్నారు. కేవలం 1991 నుంచి రెండేళ్లలో లిబరలైజేషన్‌తో 36 శాతం ఎకానమి పెంపొందించారని చెప్పారు. దేశ ఆర్థిక విధానాల విషయంలో పీవీ నర్సింహరావుకు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చుని వివరించారు. పీవీ నేతృత్వంలో భారత్‌ ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని చెప్పారు. 1991 నుంచి 5 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సహకారంతో ఎకానమిని పరుగులు పెట్టించారని అన్నారు.

పీవీ ప్రతీ నిర్ణయం దేశం అభ్యున్నతికి పాటుపడిందని, మైనారిటీ ప్రభుత్వాన్ని తన రాజకీయ చాణక్యంతో నడపగలిగారని కొనియాడారు. ఆయన ప్రపంచ మేధావని దాదాపు 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే మేధస్సు ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ సాధించడంలో కీలకపాత్ర పోషించి, ఇజ్రాయిల్ సాంకేతిక సహకారంతో సైన్యాన్ని పటిష్టం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, కమిటీ చైర్మన్ గీతరెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, కమిటీ సభ్యులు మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, శ్రవణ్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top