ఎన్‌ఎస్‌యూఐ దీక్ష విరమణ

NSUI President Venkat Balmoor Sent To The Hospital - Sakshi

రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలింపు  

వెంకట్‌ను దీక్షా శిబిరంలో పరామర్శించిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని కోరుతూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ శనివారం విరమించారు. వెంకట్‌ దీక్ష చేపట్టి మూడు రోజులు కావడంతో ఉదయం గాంధీభవన్‌లోని దీక్షా శిబిరానికి వచ్చిన వైద్యులు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్‌ లెవల్స్‌ ప్రమాదకర స్థాయికి పడిపోయాయని నిర్ధారించారు. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు తెలియజేయడంతో మాజీ ఎంపీ వీహెచ్‌తో కలిసి ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఆరోగ్య పరిస్థితి విషమించినందున దీక్ష విరమించాలని వెంకట్‌కు సూచించిన ఉత్తమ్, విద్యార్థుల పక్షాన పోరాటాన్ని కాంగ్రెస్‌ పార్టీ తరఫున కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో దీక్ష విరమణకు వెంకట్‌ అంగీకరించారు. మధ్యాహ్నం దీక్ష విరమించిన వెంకట్‌ను అంబులెన్స్‌ లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

పరీక్షలు వాయిదా వేయాలి: ఉత్తమ్‌  
విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల కోసం దీక్ష చేపట్టిన వెంకట్‌ను ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా జేఈఈ, నీట్‌ పరీక్షలను కూడా వాయిదా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

చలో రాజ్‌భవన్‌తో ఉద్రిక్తత  
వెంకట్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గం ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. దీంతో గాంధీభవన్‌ నుంచి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు రాజ్‌ భవన్‌కు బయలుదేరారు. కానీ పోలీసులు వారిని గాంధీభవన్‌ గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top