
సాక్షి,హైదరాబాద్: నిజామాబాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు తనను హత్య చేయించేందుకు కుట్రపన్నారని, ఆయన డైరెక్షన్‌లోనే టీఆర్‌ఎస్ సర్కార్ తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. తనపై దాడి జరిగిన వైనాన్ని మంత్రి కేటీఆర్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పర్యవేక్షించారని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ..తనపై జరిగిన హత్యాయత్నాన్ని, కమిషనర్, ఇతర అధికారుల తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు, ప్రివిలేజెస్ కమిటీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, హోం కార్యదర్శులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దాడి ఘటనలో తనను కాపాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసేందుకు వెళ్తే టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు.
దాడులకు భయపడం: విజయశాంతి
బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్‌ఎస్ సర్కార్.. గూండా రాజకీయాలకు తెరతీసిందని, ఈ దాడులకు భయపడేది లేదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ధ్వజమెత్తారు.