నన్ను క్షమించండి.. | Sakshi
Sakshi News home page

నన్ను క్షమించండి..

Published Mon, Oct 18 2021 2:44 AM

Mother Jumped Into Canal water With Son And Committed Suicide In Nalgonda District - Sakshi

హాలియా: మూగ కుమారుడితో కలసి ఓ తల్లి హాలియా వద్ద సాగర్‌ ఎడమ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పంది. ‘నన్ను క్షమించండి..ఎలా బతకాలో అర్థం కావడం లేదు’అని ఓ సూసైడ్‌ నోట్‌ రాసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటనలో ఆమె కొడుకు విశాల్‌ శివ (5) మృతి చెందగా తల్లిని స్థానికులు రక్షించారు. ఆదివారం నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివకుమార్‌ కథనం ప్రకారం.. అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి బక్కయ్య, అచ్చమ్మ దంపతుల కుమార్తె హేమలతని నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి చిన వెంకట లింగయ్యకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు.

వీరికి ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడైన విశాల్‌ శివ (5) పుట్టుకతో మూగ. కాగా, లింగయ్య పీహెచ్‌డీ చదువు నిమిత్తం కుటుంబంతో కలసి హైదరాబాద్‌లోని తార్నాకలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. విశాల్‌ శివ పుట్టుమూగ కావడంతో తల్లి హేమలత ప్రతి రోజు కొడుకు పరిస్థితిని తలుచుకుంటూ కుమిలిపోయేది. ఈ నెల 15న దసరా పండుగకు హేమలత పిల్లలతో కలసి తల్లిగారి ఊరు కొత్తపల్లికి వచ్చింది.

భర్త లింగయ్య స్వగ్రామైన బంకా పురానికి వెళ్లాడు. కాగా, విశాల్‌ శివకు ఈ నెల 20న ఆపరేషన్‌ చేయాల్సి ఉంది. దీంతో తన కుమారుడి పరిస్థితిపై మనస్తాపం చెందిన హేమలత షాపింగ్‌ పేరుతో విశాల్‌ను తీసు కుని హాలియాకు వచ్చింది. అక్కడ సాగర్‌ కాల్వ వద్దకు వచ్చి కుమారుడిని చీరకొంగు తో నడుముకు కట్టుకొని కాల్వలోకి దూకింది. 

హేమలతను కాపాడిన స్థానికులు.. 
తల్లి, కుమారుడు కాల్వలో కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. తర్వాత చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి విశాల్‌ శివ మృతి చెందగా, హేమలతను మెరుగైన చికిత్స కోసం నల్లగొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement