మాక్‌డ్రిల్స్‌.. వెల్‌ | Operation Abhyaas, Massive Civil Defence Mock Drill In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

Mock Drill In Hyderabad: మాక్‌డ్రిల్స్‌.. వెల్‌

May 8 2025 7:38 AM | Updated on May 8 2025 9:06 AM

Mock drill in hyderabad

సైరన్ల మోత.. యుద్ధ వాతావరణం 

సురక్షిత ప్రాంతాలకు క్షతగాత్రుల తరలింపు 

ఉత్కంఠభరితంగా వీక్షించిన నగర పౌరులు 

మాక్‌డ్రిల్స్‌ విజయవంతమయ్యాయన్న అధికారులు  

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ యుద్ధ సన్నద్ధత నేపథ్యంలో పౌరులను అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపట్టింది. దేశ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం సందర్భంగా ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేలా, వైమానిక దాడులు జరిగినప్పుడు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తూ కేంద్రం ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు నగరంలోని నాలుగు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్స్‌ చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన మాక్‌డ్రిల్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి.  

ఆద్యంతం ఉత్కంఠగా.. 
గోల్కొండ: గోల్కొండ ఆరి్టలరీ సెంటర్‌ ఆధ్వర్యంలో నానల్‌నగర్‌ అవలాన్‌ కాంప్లెక్స్‌ వద్ద డీఎఫ్‌ఓ జై కృష్ణ ఆధ్వర్యంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అంతకుముందు అవలాన్‌ కంప్లెక్స్‌కు దారి తీసే అన్ని రోడ్లను మిలిటరీ, స్థానిక పోలీసులు దిగ్బంధనం చేశారు. అరగంట పాటు రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. అవలాన్‌ కాంప్లెక్స్‌ వద్ద జరిగిన ఈ మాక్‌ డ్రిల్‌ను ప్రజలు ఉత్కంఠగా తిలకించారు. రియల్‌ లైఫ్‌లో మొదటిసారి సైన్యం మెరుపుదాడులు, సాహసోపేత సైన్య విన్యాసాలను చూసి ఆశ్చర్య చకితులయ్యారు. మరోవైపు శత్రు స్థావరాలపై దాడులు చేయడం, తమకు తాము ఏ విధంగా రక్షించుకోవడం లాంటి సైనికుల విన్యాసాలు వారి ధైర్య సాహసాలను ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు. సుమారు 29 నిమిషాల పాటు జరిగిన మాక్‌ డ్రిల్‌ దేశరక్షణ, శత్రు నిర్మూలన తదితరాలపై సైనికుల ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మరో వైపు పరిసర ప్రాంతాల్లో  పూర్తిగా నిశ్శబ్దం ఆవహించింది. కొందరు తమ ఇళ్లలోని విద్యుత్‌ కనెక్షన్లను  ఆఫ్‌ చేయగా మరికొందరు మాక్‌ డ్రిల్‌ సూచనలను పాటిస్తూ ఎల్రక్టానిక్‌ పరికరాలు, ఎల్‌పీజీ గ్యాస్‌ స్వీచ్‌లను ఆఫ్‌ చేశారు. 

మే ఫ్లవర్‌లో సైరన్ల మోత.. 
ఉప్పల్‌/మల్లాపూర్‌: ఉప్పల్‌ మల్లాపూర్‌ మే ఫ్లవర్‌ అపార్టుమెంట్‌లో బాంబుల మోత.. స్థానికులంతా ఉలిక్కి పడ్డారు. అపార్టుమెంట్‌ వాసులు ఎక్కడికక్కడ తలుపులు వేసుకున్నారు. లైట్లు బంద్‌ చేశారు. సెల్‌ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేశారు. చెలరేగిన మంటలు.. ఫైరింజిన్లు.. అంబులెన్స్‌లు.. వైద్య బృందం, పోలీసులు డీఆర్‌ఎఫ్‌ బలగాలు, ఆర్మీ సిబ్బంది.. ఉరుకులు.. పరుగులు.. క్షతగాత్రుల తరలింపు.. ఇలా మాక్‌డ్రిల్‌ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. యుద్ధ సమయాల్లో అనుకోని  విపత్తు వస్తే అపార్టుమెంట్‌లో నుంచి ఎక్కడ  నుంచి బయట పడవచ్చు లాంటి అంశాలను మాక్‌డ్రిల్‌లో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మాక్‌డ్రిల్‌లో మేడ్చల్‌– మల్కాజిగిరి కలెక్టర్‌ గౌతం పొత్రూ, మల్కాజిగిరి డీసీపీ  పద్మజ, ఏసీపీ చక్రపాణి, జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి, బీజేఈ అధికారి ప్రసన్న కుమార్, ఏడీఎఫ్‌ఎస్‌ ఫైర్‌ సరీ్వస్‌ అధికారి వి. శ్రీనివాస్, హైడ్రా అధికారి పాపయ్యతో పాటు 150 మంది ఎన్‌సీసీ విద్యార్థులు, 70 మంది పోలీస్‌ అధికారులు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

బాల్కనీల నుంచి భయాందోళనతో.. 
సంతో‹Ùనగర్‌: ఐఎస్‌ సదన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ట్విన్‌ సిటీస్‌ బీపీఎస్‌లో బుధవారం సౌత్, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కాంతిలాల్‌ సుభాష్‌ పాటిల్, అగి్నమాపక శాఖ రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ హరినాథ్‌ రెడ్డిల ఆధ్వర్యంలో సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. ట్విన్‌ సిటీస్‌ టవర్స్‌లో ఒక్కసారిగా బాంబులు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళనతో బాల్కనీల నుంచి తమను కాపాడాలంటూ అరుపులు, కేకలు వేయడంతో స్థానిక పోలీసులు, అగి్నమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాంబు దాడిలో తీవ్ర గాయాలకు గురైన క్షతగాత్రులను ఒక్కొక్కరిని అగి్నమాపక శాఖకు చెందిన భారీ నిచ్చెనల ద్వారా జాగ్రత్తగా కిందికి దించడం... వారిని అంబులెన్స్‌ సహాయంతో వైద్య చికిత్సల నిమిత్తం కంచన్‌బాగ్‌ అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన అపార్ట్‌మెంట్‌లో ఉన్న బా«ధితులను ప్రత్యేక వాహనాలలో కేంద్రీయ విద్యాలయానికి తరలించారు. ఆ తర్వాత ఇదంతా మాక్‌డ్రిల్‌లో భాగమేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. మాక్‌ డ్రిల్‌లో హైదరాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ ముకుంద్‌ రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణ, సౌత్‌ జోన్‌ డీసీపీ అశోక్, సైదాబాద్‌ తహసీల్దార్‌ జయశ్రీ, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ వెంకన్న, మురళీమోహన్‌ రెడ్డి, సౌత్, ఈస్ట్‌ జోన్‌ అడిషనల్‌ డీసీపీ రఘు, ట్రాఫిక్‌ డీసీపీ–2 అశోక్‌ కుమార్, డీసీపీ–3 ఆర్‌.వెంకటేశ్వర్లు, సౌత్, ఈస్ట్‌ జోన్‌ ఏసీపీ వి.చంద్ర కుమార్, వైద్యశాఖ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ బిర్జీస్‌ ఉన్నీసా, మొత్తం 12 విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.  

అంతటా అప్రమత్తం..  
కంటోన్మెంట్‌: ఈస్ట్‌మారేడుపల్లి మన్‌భుమ్‌ అపార్ట్‌మెంట్‌ ఆవరణలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో వివిధ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు అపార్ట్‌మెంట్‌ ముందు ఓ బాంబు పేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు, ఫైర్‌ సేఫ్టీ సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకున్నారు. రెండు ప్రత్యేక ఫైర్‌ ఇంజిన్‌లు అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చాయి. ఇంతలోనే ఎన్‌సీసీ క్యాడెట్‌లు పోలీసులు, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలు, జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌ సిబ్బంది పరుగు పరుగున అపార్ట్‌మెంట్‌లోకి చేరిపోయారు. క్షతగాత్రులను ఒక్కొక్కరిగా స్ట్రెచర్‌లు, వీల్‌చైర్‌లపై కిందకు తీసుకొచ్చారు. అప్పటికే అపార్ట్‌మెంట్‌ ఎదుటకు చేరుకున్న అంబులెన్స్‌లలోకి వారిని చేర్చి ఆసుపత్రికి తరలించారు. నిజంగా ఏదైనా ఆపద సంభవిస్తే ఎలా స్పందించాలో వివరిస్తూ చేసిన మాక్‌డ్రిల్‌ ఎంతగానో ఉపకరిస్తుందని ఆయా శాఖల సిబ్బంది పేర్కొన్నారు. మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ను నార్త్‌జోన్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్రాజు, ఫైర్‌ సేప్టీ ఆఫీసర్‌ శ్రీధర్, కంటోన్మెంట్‌ శానిటరీ సూపరింటెండెంట్‌ మహేందర్‌ పరిశీలించారు.  

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అలర్ట్‌ 
సికింద్రాబాద్‌: పహల్గాం ఘటన, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతను మూడింతలు పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల విషయంలో రెట్టించిన అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 50 మందికి ఒక బృందం చొప్పున మూడు బృందాలకు చెందిన 150 మంది రైల్వే రక్షణ ప్రత్యేక దళం (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) పోలీసులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మోహరించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే 100 మంది ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉన్నారు. 100 మంది ప్రత్యేక ఆర్‌పీఎఫ్‌ పోలీసులు మూడు షిఫ్టుల్లో (24 గంటలు) సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పహారా కాస్తున్నారు. మరో 50 మంది పోలీసులు మొబైల్‌ టీంలుగా ఏర్పడి సేటషన్‌ పరిసరాల్లో గస్తీ నిర్వహించడంతోపాటు, స్టేషన్‌కు వచి్చవెళ్లే వ్యక్తులపై నిఘా వేస్తున్నారు. జీఆర్‌పీ పోలీసుల సహకారంతో ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు 
తీసుకుంటున్నారు. 

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్న అన్ని రైళ్లలోనూ రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.   ప్రయాణికుల వెయిటింగ్‌ హాళ్లు, పది ప్లాట్‌ఫామ్‌లలో సంచరించే వ్యక్తుల లగేజీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరికొందరు పోలీసులను మఫ్టీలో ఉంచి గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండే గదులు, ప్రవేశమార్గాల పరిస్థితులను సీసీ కెమెరాల ద్వారా వీక్షిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించిన సందర్భాల్లో మొబైల్‌ ద్వారా రైల్వే కంట్రోల్‌ రూం (హెల్ప్‌లైన్‌) 139 నంబరు ద్వారా సమాచారం అందించాలని సూచించారు.  

ఆరు ప్రాంతాల్లో సెక్యూరిటీ రిహార్సల్స్‌ 
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బుధవారం ఆపరేషన్‌ అభ్యాస్‌ పేరుతో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించగా... ఆరు కీలక, సున్నిత ప్రాంతాల్లో సెక్యూరిటీ రిహార్సల్స్‌ జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిఘా వర్గాలు ఈ సంస్థల్ని ఎంపిక చేశాయి. ఈ ఆరూ రక్షణ శాఖకు సంబంధించివే కావడం గమనార్హం. సికింద్రాబాద్, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లిల్లో ఉన్న కంటోన్మెంట్లతో పాటు మెహిదీపట్నం, గోల్కొండల్లో ఉన్న గారిసన్‌ ప్రాంతాలను సెక్యూరిటీ రిహార్సల్స్‌ కోసం రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మంగళవారమే డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఈ రిహార్సల్స్‌లో భద్రత బలగాలతో పాటు పోలీసు విభాగం నుంచి ఏసీపీ ర్యాంకు అధికారి, ఆక్టోపస్‌ కమాండోలు పాల్గొన్నాయి. ఈ సెక్యూరిటీ రిహార్సల్స్‌ నిర్వహణ కోసం హైదరాబాద్‌ పోలీసులు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఏసీపీలను కేటాయించారు.  

ఎలా జాగ్రత్తపడాలో బోధపడింది.. 
అత్యవసర సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనేది మాక్‌ డ్రిల్‌తో అర్థమైంది. మే ఫ్లవర్‌ గ్రాండ్‌ అపార్ట్‌మెంట్‌లో 370 ప్లాట్లు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రెండుసార్లు ట్రయల్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అపార్ట్‌మెంట్‌ మొత్తం మాక్‌డ్రిల్‌లో భాగస్వాములు అయ్యారు.        – బీవీ రావు, మల్లాపూర్,     మే ప్లవర్‌ గ్రాండ్‌  అధ్యక్షుడు 
 
కళ్లకు కట్టినట్లు చూపించారు 
బాంబులు పేలినప్పుడు, ఉగ్రవాదులు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి, బాంబులు పేలి్చనప్పుడు సీన్‌ఎలా ఉంటుందో అచ్చం అలాగే మాక్‌డ్రిల్‌తో అవగాహన 
కలి్పంచారు. మహిళలు, చిన్నారులు ఎలా జాగ్రత్త పడాలో మాక్‌డ్రిల్‌తో అవగాహన 
కలిగింది.      – జ్యోతి రాణి.     మే ఫ్లవర్‌ అపార్ట్‌మెంట్‌ వాసి

ఎన్నో అంశాలు తెలిశాయి.. 
అనుకొని విపత్తు సంభవించినప్పుడు మనం ఎలా బయట పడాలి, ఆపదలో ఉన్న వారిని సైతం ఎలా గట్టేకించాలనే అంశాలు బోధపడ్డాయి.  ముఖ్యంగా యుద్ధ సమయాల్లో ఎటాక్‌ జరిగినప్పుడు ఎలా మెలగాలో చూపించారు. మాక్‌డ్రిల్‌ వల్ల మాలో భయం కూడా పోయింది. 
 – మల్లేష్‌, మే ఫ్లవర్‌ అపార్టుమెంట్‌ వాసి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement