
హైదరాబాద్: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్.. మీద దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని అన్నారు.
కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు అని కవిత అన్నారు. తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం. ఎన్ని కమిషన్లను ఏర్పాటు చేసినా కాలక్రమంలో తప్పకుండా న్యాయం గెలుస్తుందని అన్నారు. నిజాలన్నీ బయటకు వస్తాయి.. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసులు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం (మే 20) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది.