
దీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణలో అందరికీ రాజ్యాధికారమే నా లక్ష్యం
ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద దీక్షలో కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే రణరంగం సృష్టిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తమది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవం కోసమే తమ ఆరాటమని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి బీజేపీ వైఖరిని బయట పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి కవిత సూచించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం కవిత ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద 72 గంటల దీక్షకు దిగారు. హరియాణాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ)నాయకుడు అర్జున్‌సింగ్ చౌతాలాతోపాటు వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు కవితకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో రాజ్యాధికారంలో అందరికీ వాటా రావాలని, బీసీలకు ప్రాధాన్యం దక్కాలని కవిత డిమాండ్ చేశారు.
జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తాం: బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు కూడా వాటా ఉందన్న అనుమానంతో బిల్లులను ఆపుతున్నామని బీజేపీ చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని కవిత అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు ప్రత్యేకంగా ముస్లింల కోసం పది శాతం రిజర్వేషన్ల బిల్లులపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేయకపోతే ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే టైమ్ పాస్ ధర్నాలతో సాధించేదేమీ లేదని, బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతిని కలవడంతోపాటు ఆర్డినెన్స్ ఆమోదంలో గవర్నర్ జాప్యంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఆగస్టు 8 తర్వాత కవిత దీక్ష చేసేందుకు.. పోలీసులు హైకోర్టు ఎదుట సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టులపై ఉన్న గౌరవంతో తన దీక్షను విరమిస్తున్నట్టు కవిత ప్రకటించారు. అయితే బీసీ రిజర్వేషన్ల కోసం తన పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కూకటివేళ్లతో కాంగ్రెస్‌ను పెకిలించాలి: అర్జున్‌సింగ్ చౌతాలా
కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించాలని ఐఎన్‌ఎల్‌డీ నాయకుడు అర్జున్‌సింగ్ చౌతాలా పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్ కోసం కవిత చేస్తున్న పోరాటంలో తాము భాగస్వాములం అవుతామని ప్రకటించారు.