పాత సీట్లకు ప్రభుత్వ ఫీజులే 

Minister Sabitha Indra Reddy Speaks About University Of Greenfield Reservations - Sakshi

 బ్రౌన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీల్లోని కొత్త సీట్లకే యాజమాన్య ఫీజులు 

ప్రైవేట్‌ వర్సిటీల్లో 25 శాతం సీట్లు తెలంగాణ వారికే: మంత్రి సబిత

సాక్షి, హైదరాబాద్‌: పాత విద్యా సంస్థలనే యూనివర్సిటీలుగా మార్చితే అవి బ్రౌన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీలుగా, పాత విద్యా సంస్థలు లేకుండా కొత్తగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే గ్రీన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీలుగా అనుమతి ఇచ్చామని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టంచేశారు. బ్రౌన్‌ఫీల్డ్‌ వర్సిటీల్లో పాత సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే ఉంటాయని, వాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని పేర్కొన్నారు. అదే వర్సిటీల్లో కొత్త సీట్లలో చేపట్టే ప్రవేశాల్లో మాత్రం యాజమాన్యాలే ఫీజులను నిర్ణయిస్తాయని, వాటికి రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యలు లేవనెత్తిన వివిధ అంశాలపై ఆమె వివరణ ఇచ్చారు.

ఇంజనీరింగ్‌ కాలేజీల విషయంలో నిబంధనలు పాటించని మంత్రులు, ఎమ్మెల్యేల కాలేజీలను కూడా మూసివేయించామని చెప్పారు. యూనివర్సిటీల ఏర్పాటుకు 16 దరఖాస్తులు వస్తే నిపుణుల కమిటీ సిఫారసు చేసిన 9 సంస్థల్లో 8 సంస్థలు ముందుకు వచ్చాయని, అందులో వివాదాల్లేని 5 సంస్థలకు మొదటి విడతలో అనుమతి ఇచ్చామని, మిగతావి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. గ్రీన్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీల్లో ఫీజులు యాజమాన్యాలే నిర్ణయించుకుంటాయని, ఆయా సంస్థల గవర్నింగ్‌ బాడీలో విద్యాశాఖ కార్యదర్శి ఉంటారని, ప్రభుత్వ నియంత్రణ ఉంటుం దని అన్నారు. వాటిల్లో 25 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలన్న నిబంధన ఉందన్నారు. వీసీలు, అధ్యాపకుల నియామకాలకు లైన్‌ క్లియర్‌ అయిందన్నారు. 

ప్రపంచస్థాయి ఎలా సాధ్యం?
ఎమ్మెల్యే డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ వర్సిటీల్లో వసతులే లేకుంటే ప్రపంచస్థాయిలో అవి ఎలా పోటీ పడతాయని ప్రశ్నిం చారు.  ఎమ్మెల్యే మోజంఖాన్‌ మాట్లాడుతూ ప్రైవేటు వర్సిటీల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పి ంచాలన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, సంజయ్‌ మాట్లాడుతూ ప్రైవేటు వర్సిటీల అవసరం ఎంతైనా ఉందన్నారు. సభ్యుల ప్రశ్నలపై మంత్రి సమాధానం ఇచ్చాక బిల్లును సభ ఆమోదించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top