ఆ రెండు పాలసీలు ‘పాస్‌’

Minister KTR Inaugurate Architects Festival Conference in Hyderabad - Sakshi

టీఎస్‌ ఐ పాస్, బీ పాస్‌లపై మంత్రి కేటీఆర్‌

మాదాపూర్‌: రాష్ట్రంలో ప్రవేశపెట్టిన టీఎస్‌ ఐపాస్, టీఎస్‌ బీపాస్‌ పాలసీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో మూడు రోజులపాటు జరుగనున్న ఐఐఏ (ది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌) ఉత్సవ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోందని, ప్రతి ఒక్కరూ జీవించేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.

టీఎస్‌ ఐపాస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో, టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో అనుమతులను పొందవచ్చని తెలిపారు. ఈపాలసీల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, మధ్యవర్తులు లేకుండా పనులు పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. నగరంలో అండర్‌ పాస్‌లను ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్య తగ్గుముఖం పట్టిందని అన్నారు.

తెలంగాణలో వ్యవసాయవృద్ధి విస్త్రృత స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా 2.5 కోట్ల మొక్కలను నాటామని, రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చనున్నామని తెలిపారు. హైదరాబాద్‌ మహానగరం ఒకప్పుడు రాజభవనాలు, ఉద్యానవనాలతో ఉండేదని, నగరంలో నిర్మితమైన ప్రతి ప్యాలెస్‌కు గుర్తింపు ఉందని చెప్పారు.

చార్మినార్‌తోపాటు కేబుల్‌బ్రిడ్జి హైదరాబాద్‌ ప్రత్యేకతను తెలుపుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐఏ తెలంగాణ చాప్టర్‌ చైర్మన్‌ ఉదయశంకర్‌ దోనీ, ఐఐఏ నాట్‌కాన్‌–21 కన్వీనర్‌ శ్రీధర్‌ గోపిశెట్టి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఇంజనీర్లకు బంగారు పతకాలను అందజేశారు. కార్యక్రమానికి సంబందించిన బ్రోచర్‌ను విడుదల చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top