5,204 స్టాఫ్‌ నర్సు పోస్టులు.. 

MHSRB Notifies 5204 Posts Of Staff Nurse Posts in Telangana - Sakshi

భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ 

జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని వివిధ వైద్యారోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఆయా పోస్టులకు తగిన అర్హతలున్నవారు తమ వెబ్‌సైట్‌ (https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు.

వచ్చే నెల 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి ఫిబ్రవరి 15న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ అనుభవమున్న వ్యక్తులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. ఈ పోస్టులకు పేస్కేల్‌ రూ.36,750 – రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు. 

అనుభవ ధ్రువీకరణతో.. 
స్టాఫ్‌ నర్సు పోస్టులను బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు.

కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ అనుభవమున్నవారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. ఉదాహరణకు స్టాఫ్‌ నర్స్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గతంలో కాంట్రాక్ట్‌/ఔట్‌సోర్సింగ్‌ నర్స్‌గా చేసిన కాలానికి సంబంధించిన పాయింట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఏఎన్‌ఎంగా, ఇతర సేవలు అందించి ఉన్నా దానిని పరిగణనలోకి తీసుకోరు. 

రాత పరీక్ష సిలబస్‌ ఇదీ.. 
అనాటమీ ఫిజియాలజీలో 14 అంశాలపై, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ నర్సింగ్, ఫస్ట్‌ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ హైజీన్, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్, మెంటల్‌ హెల్త్, చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్, మిడ్‌ వైఫరీ గైనకాలాజికల్, గైనకాలజియల్‌ నర్సింగ్, కమ్యూని టీ హెల్త్‌ నర్సింగ్, నర్సింగ్‌ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్‌ టు రీసెర్చ్, ప్రొఫెషనల్‌ ట్రెండ్స్‌ అండ్‌ అడ్జస్ట్‌మెంట్, నర్సింగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వార్డ్‌ మేనేజ్‌మెంట్‌ లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్‌ ఉంటుంది. 

జోన్లవారీగా స్థానికులకు 95% రిజర్వేషన్‌ 
నర్సు పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్లకు అభ్యర్థులకే 95% పోస్టులను కేటా యిస్తారు. మిగతావి ఓపెన్‌ కేటగిరీ కింద భర్తీ చేస్తా రు.జోన్‌–1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌ జిల్లాలు.. జోన్‌–2లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్‌–3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్‌–4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్‌.. జోన్‌–5లో సూర్యాపేట, నల్లగొండ, భువన గిరి, జనగాం.. జోన్‌–6లో మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌.. జోన్‌–7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు ఉన్నాయి.

నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. 
►అభ్యర్థులు నోటిఫికేషన్‌ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి.  

►ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ’నిపుణుల కమిటీ’కి రిఫర్‌ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. 

►దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 44 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2022 జూలై ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. 

►అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతోపాటు అవసరమైన పత్రాల సాఫ్ట్‌ కాపీ (పీడీఎఫ్‌)లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

►ఆధార్‌ కార్డ్, పదో తరగతి సర్టిఫికెట్, జీఎన్‌ఎం లేదా బీఎస్సీ నర్సింగ్‌ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), స్థానికత గుర్తింపు కోసం 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే సదరు కుల ధ్రువీకరణ పత్రం, బీసీల విషయంలో తాజా నాన్‌–క్రీమీలేయర్‌ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కోరేవారు తాజా ’ఆదాయం, ఆస్తి సర్టిఫికెట్‌’, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్, సదరం నుంచి దివ్యాంగ సర్టిఫి కెట్, ఎన్‌సీసీ ధ్రువపత్రం వంటివి అవస రాన్ని బట్టి జత చేయాల్సి ఉంటుంది. 

►దరఖాస్తు రుసుము రూ.120, పరీక్ష ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌ కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది. 

►ఆన్‌లైన్‌లో ఒకసారి సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. రాతపరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. 

►ఓఎంఆర్‌ విధానంలో ఇంగ్లిష్‌లో నిర్వహించే రాతపరీక్షలో 80 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. 

►హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top