Mee Seva: ‘ఆసరా’ కోసం పైసా వసూల్‌

Mee Seva: Extra Charges For Application Issue In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఆసరా అర్జీదారులకు వసూళ్ల బెడద తప్పడం లేదు. ఆసరా పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను ఉచితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించగా ఆచరణలో వసూళ్ల పర్వం కొనసాగుతూ..నే ఉంది. జిల్లా అధికారులు కొలువుండే జిల్లా కేంద్రంతో పాటు మారుమూల పల్లెల్లోనూ దోపిడీ దర్జాగా సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం మొద్దునిద్రలో జోగుతుండటం అర్జీదారులకు శాపంగా మారింది. మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో అధికారులకు ఉన్న అనుబంధమే తమకీ పరిస్థితని బాధితులు వాపోతున్నారు. మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో అర్జీలను నమోదు చేస్తుండగా నిర్వాహకులు ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. ఒక్కో అర్జీకి రూ.50 నుంచి రూ.వంద వరకు దర్జాగా వసూలు చేస్తున్నారు. ఇదేంటంటే మాకేమన్న జీతాలిస్తున్నారా అంటూ ఛీత్కారపు మాటలు.

అధికారులేం చేస్తున్నట్టు..
ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఎలాంటి రుసుం వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. సదరు సేవలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ఉచితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన మీ సేవ కేంద్రాల నిర్వాహకులు మాత్రం ఇష్టారీతిగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మీ సేవ కేంద్రాన్ని రెవెన్యూ, ఎన్‌ఐసీ అధికారులు ప్రతి నెలా నిర్దేశిత సంఖ్యలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. గిర్దావర్, నాయబ్‌ తహసీల్దార్‌తో పాటు ఈ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ తనిఖీలు నిర్వహించాలి. కానీ, కార్యాలయాల్లోనే కూర్చుని తనిఖీ చేసినట్లు మమ అనిపిస్తున్నారు. ఒకవేళ తనిఖీలే జరిగితే గరిష్ట కేంద్రాలు సీజ్‌ కావాల్సిందే. 

టోల్‌ఫ్రీ నంబర్‌ 1100కు ఫిర్యాదు చేయొచ్చు
మీ సేవ, ఈ సేవ కేంద్రాలు ఏ కేంద్రాలైనా ఆసరా పింఛన్ల అర్జీలను ఉచితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఒకవేళ రూపాయి అడిగినా ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్‌ 1100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయాల్లో సరిౖయెన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మీ సేవ కేంద్రాన్ని సీజ్‌ చేసే అవకాశముంది. ఒకవేళ సదరు అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఆర్డీవో, లేదా ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే సరి.

31 వరకు అవకాశం.. మార్గదర్శకాలివి
► 57 ఏళ్లు నిండినవారికి ఆసరా పింఛన్లు మంజూరు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆన్‌లైన్‌ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. అర్హులు ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తు సమయంలో ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే దరఖాస్తుదారుల తరఫున ఈ సేవ కమిషనర్‌కు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. 
 జనన, మరణ నమోదు అధికారులు జారీ చేసిన పత్రం, టీసీ, పాఠశాల నుంచి బోర్డు పరీక్షలకు హాజరైన ధ్రువీకరణ పత్రం లేదా  ఓటరు కార్డు లేదా ఓటర్ల జాబితా ఆధారంగా దరఖాస్తుదారు పుట్టిన తేదీని నిర్ణయించనున్నారు.
► పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలకు మించకూడదు. ఆ«ధార్‌ కార్డులో పేర్కొన్న విధంగా లబ్ధిదారు పేరు, పాస్‌పోర్టు ఫొటో, జిల్లా, మండలం, ఆధార్‌ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌ కోడ్, బ్రాంచి, మొబైల్‌ నంబరు తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ జత చేయడం తప్పనిసరి. 

ఆదాయ ధ్రువీకరణ కోసం పరుగులు
► దరఖాస్తుతో పాటు ఆదాయం, బ్యాంకు ఖాతా, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను కోరుతున్నారు. అన్ని పత్రాలు ఉన్నా ఆదాయ ధ్రువపత్రం అందరి వద్ద లేకపోవడంతో దానికోసం పరుగులు పెడుతున్నారు. 
► ఆదాయ ధ్రువపత్రం పొందేందుకు రూ.10, రూ.20 విలువ ఉన్న స్టాంపు పత్రం అవసరం. కానీ జిల్లాలో ఇవి కొరత ఉండటంతో రూ.50, రూ.100 విలువ ఉన్న స్టాంపు పత్రాలను కొనాల్సి వస్తోంది. జిల్లాకేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు 20కి పైగా స్టాంప్‌ వెండర్లు ఉన్నారు. 
► వీరివద్ద తక్కువ ధర పత్రాలు లేకపోవడంతో అధిక ధర వెచ్చించి కొనాల్సి వస్తోంది. రూ.50 విలువ గల పత్రానికి రూ.70, రూ.100 విలువ ఉన్న పత్రానికి రూ.130 వసూలు చేస్తున్నారు. ఇలా ఒక దరఖాస్తుకు రూ.200 వరకు ఖర్చవుతోందని బా«ధితులు ఏకరవు పెడుతున్నారు.

పది రోజులుగా ఆధార్‌ సర్వర్‌డౌన్‌
జిల్లాలో పదిరోజులుగా ఆధార్‌ సేవలు నిలిచిపోయాయి. సర్వర్‌ డౌన్‌ కారణంగా సాంకేతిక సమస్యలతో సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. కేంద్రాల నిర్వాహకులు మౌజ్‌లతో ఎంత కుస్తీ పట్టినా చివరికి నిరాశే ఎదురవుతోంది. దీంతో రైతులు, పింఛన్‌ ఆశావహులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నాలుగు ఈసేవా కేంద్రాలు, మండలాల్లో 15, బ్యాంకుల్లో 65 ఆధార్‌సేవా కేంద్రాలు, మీసేవాల్లో 54 కేంద్రాల ద్వారా ఆధార్‌ నమోదు జరుగుతోంది. రైతుబీమాకు మూడు రోజులే అవకాశం ఉండడంతో రైతులు రోజూ మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ గడువు ముగిసిందంటే మరో సంవత్సరం వరకు వేచిచూడాల్సిందే. వృద్ధాప్య పింఛన్‌ వయసును 57కు కుదించడంతో దరఖాస్తు చేసేందుకు చాలామంది మీ సేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. తీరా కేంద్రానికి వెళ్లాకా ఆధార్‌లో అర్హత వయసు లేకపోవడంతో తిరుగుముఖం పడుతున్నారు. వీరికి కూడ ఈ నెల ఆఖరు చివరి తేది. సర్వర్‌ డౌన్‌ కారణంగా రాష్ట్రమంతటా ఇదే సమస్యని అధికారులు చెబుతున్నారు. వర్షన్‌లు చేంజ్‌ కావడం, మాడిఫికేషన్‌ అయినకొలది బేసిక్‌ ప్రాబ్లమ్స్‌ ఎదురవుతున్నాయి. దీంతో సైట్‌ ఓపెన్‌ కావడం లేదని అధికారులు వివరించారు. 

రూ.వంద తీసుకున్నరు
మా నానమ్మ ఆసరా పింఛన్‌ కోసం దరఖాస్తు చేద్దామని కలెక్టరేట్‌ సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లాను. సంబంధిత పత్రాలు తీసుకున్నారు. అయిపోయింది రూ.వంద ఇవ్వమని అడిగారు. ఇదేంటంటే మాకెమన్న ప్రభుత్వమిస్తదా.. అంటూ మాట్లాడారు. వారి ఛీత్కారపు మాటలకు తాళలేక డబ్బులిచ్చేశా.

 – రాజేందర్, మంకమ్మతోట 

దర్జాగా వసూలు చేస్తున్నారు
ప్రభుత్వం ఉచితంగా దరఖాస్తులు తీసుకుసేందుకు అవకాశమిచ్చిందని మీ సేవ సెంటర్‌కు వెళ్తే దర్జాగా వసూలు చేస్తున్నారు. మా తాతది అప్లై చేద్దామని భగత్‌నగర్‌లోని మీ సేవ కేంద్రానికి వెళ్లా. సంబంధిత పత్రాలిచ్చాకా రూ.80 తీసుకున్నారు. ఇదేంటీ ఉచితం కదా అంటే.. అది పేపరోళ్లు గట్లనే రాస్తరు. వాస్తవం వేరు అన్నారు.  

 – కరుణ, కట్టరాంపూర్‌ 

చదవండి: ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top