కాలేజీలో ర్యాగింగ్.. వైద్యవిద్యార్థిని  ఆత్మహత్యాయత్నం 

A medical student attempted suicide while raging In Warangal - Sakshi

సీనియర్‌ విద్యార్థి ర్యాగింగ్, వేధింపులతో పీజీ వైద్య విద్యార‍్థిని ఆత్మహత్యకు యత‍్నించడం కలకలం రేపుతోంది. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల (కేఎంసీ)లో అనస్థీషియా విభాగంలో పీజీ ఫస్టియర్‌ చదువుతున్న ధరావత్‌ ప్రీతి (26) బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎంజీఎం ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ప్రీతి బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో తీవ్ర తలనొప్పి, అలసటగా ఉందని చెప్పి నర్సు వద్ద నుంచి ఓ ఇంజక్షన్‌ తీసుకుని వేసుకుంది.

క్షణాల వ్యవధిలోనే తన గదిలో స్పృహ తప్పి పడిపోవడంతో ఆర్‌ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధింపులే దీనికి కారణమని ఆమె తండ్రి ఆరోపించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

హేళన చేస్తూ వేధించి.. 
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండాకు చెందిన ధరావత్‌ నరేందర్, శారద దంపతులకు ముగ్గురు కుమార్తెలు పూజా, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. నరేందర్‌ వరంగల్‌లోని ఆర్‌పీఎఫ్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే వీరి కుటుంబం హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు మకాం మార్చింది. పూజా, ఉషల పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు వంశీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు.

ఇంట్లో ఎప్పుడూ సరదాగా ఉండే ప్రీతి గాంధీ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. కేఎంసీలో పీజీ అనస్థీషియా కోర్సు చదువుతున్న ప్రీతి ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్‌ విద్యార్థులతో కలిసి అపరేషన్‌ థియేటర్‌లో విధులు నిర్వర్తిస్తోంది. అక్కడ పరిచయమైన సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ ర్యాగింగ్‌ చేస్తూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. తక్కువ కులం అంటూ హేళన చేశాడు. దీనిపై ప్రిన్సిపాల్‌ ఆదేశానుసారం అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ నాగార్జున రెడ్డి సైఫ్, ప్రీతిలకు మంగళవారం సాయంత్రం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెకు వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని విద్యార్థులు అంటున్నారు.  

ఈఓటీలో ఏం జరిగిందంటే..: 
విధుల్లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ అపరేషన్‌ థియేటర్‌ (ఈఓటీ)లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు విధులకు హాజరైన ప్రీతి తోటి వైద్యులతో కలిసి రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సలు చేసింది. తిరిగి బుధవారం తెల్లవారుజామను 5 గంటల సమయంలో మరో శస్త్రచికిత్సకు సిద్ధమై ఆరు గంటలకల్లా పూర్తిచేసింది. ఈ క్రమంలో ప్రీతి తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్‌ ఇంజక్షన్‌ కావాలని స్టాఫ్‌నర్సుకు చెప్పింది. శస్త్రచికిత్స పూర్తిచేసిన బాధితుడిని వార్డుకు తీసుకెళ్లి తిరిగి థియేటర్‌కు వచి్చన తోటి వైద్యులు ప్రీతి ఎక్కడ ఉందని అక్కడున్న సిబ్బందిని అడిగారు. డాక్టర్స్‌ రూమ్‌లో ఉందని చెప్పగానే అక్కడికి వెళ్లిన వారికి ప్రీతి ఆపస్మారకస్థితిలో ఉండటం గమనించారు.  

వద్దు డాడీ అంది.. ఇప్పుడింత పనైంది 
‘కాలేజీ, ఆస్పత్రిలో ర్యాగింగ్‌ చేస్తూ వేధిస్తున్న సైఫ్‌పై ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తా అంటే వద్దు డాడీ అంటూ నివారించింది. ప్రిన్సిపల్‌ కక్ష సాధింపు చర్యలకు దిగి మార్కులు తక్కువ వేస్తారంటూ భయపడేది. సైఫ్‌ అరాచకంపై ఏసీపీ కిషన్‌కు చెప్పాను. ఆ తర్వాత కేఎంసీ ప్రిన్సిపల్‌ మోహన్‌ దాసు ఆదేశాల మేరకు డాక్టర్‌ నాగార్జునరెడ్డి మంగళవారం సాయంత్రం అతడిని మందలించారు. నాపై ఫిర్యాదు చేస్తావా అంటూ సైఫ్‌ మరోసారి నా బిడ్డను బెదిరించగా మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు యతి్నంచింది’ అని తండ్రి నరేందర్‌ కన్నీళ్ల పర్యంతమయ్యారు. నరేందర్‌ ఫిర్యాదుమేరకు సైఫ్‌పై వేధింపులు, ర్యాగింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద మట్టెవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. వరంగల్‌ ఏసీపీ కిషన్‌ దర్యాప్తు చేస్తున్నారు. 

కార్డియాక్‌ అరెస్ట్‌తోనే... 
కార్డియాక్‌ అరెస్టు రావడంతో వైద్య బృందంతో సీపీఆర్‌ ద్వారా చికిత్స చేసి ట్రీట్‌మెంట్‌ ఇచ్చామని ఎంజీఎం సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. గుండెకు సంబంధించి 28 శాతం ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ ఆఫ్‌ హార్ట్, గ్లోబల్‌ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటీస్, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు తేలిందన్నారు. ప్రీతి థైరాయిడ్, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టు తేలిందన్నారు. 

సెల్‌ఫోన్‌లో అనస్థీషియాపై సెర్చ్‌ 
ప్రీతి ఆత్మహత్యకు యతి్నంచకముందు బుధవారం తెల్లవారుజామున తన సెల్‌ఫోన్‌లో గూగుల్‌ సెర్చ్‌లో సాధారణ వ్యక్తి అనస్థీషియా తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో చూసినట్లు విద్యార్థులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రీతి ట్రెమడాల్‌ తీసుకుందని కొందరు, అనస్థీషియా  తీసుకుందని మరికొందరు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top