ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి..

Medical Professionals Warns Increasing Air Pollution For Using Crackers - Sakshi

టపాకాయలు కాల్చడంతో పెరుగుతున్న వాయు కాలుష్యం 

మంచు, పొగ కలగలిసిన కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు 

ఆస్తమా, టీబీ బాధితులు, కోవిడ్‌ బారిన పడినవారిపై అధిక ప్రభావం

వైద్య నిపుణుల హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టపాకాయలు కాల్చాక వివిధ రూపాల్లో వెలువడే కాలుష్యాలు కనీసం మూడురోజుల పాటు ప్రభావం చూపే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వాహనాలు, పరిశ్రమల ద్వారా, పంటలు కాల్చాక, ఇతర రూపాల్లో వెలువడే కాలుష్యాలు వివిధ అనారోగ్య సమస్యలున్న వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే.

చలికాలంలో పొగ, ఇతర కాలుష్యాలు కలగలిసి స్మాగ్‌ (పొగ, మంచు కలగలిసినది )గా మారడంతో ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లోని ప్రజలకు శ్వాసకోశ, ఇతర తీవ్ర సమస్యలు ఎదురౌతున్నాయి. ఇక దీపావళి పండుగ సందర్భంగా కాల్చే టపాసులతో విపరీతంగా వెలువడే కాలుష్యం మూడురోజుల పాటు వాతావరణంలోనే అది కూడా భూ ఉపరితలానికి కొంత ఎత్తులోనే ఉంటుంది. అప్పటికే ఉన్న కాలుష్యానికి ఇది తోడవడంతో తీవ్రత మరింత పెరగడంతో పాటు మరింత ఎక్కువ మందిపై ప్రభావం చూపేందుకు అవకాశం ఏర్పడుతోంది.

మంచు వాతావరణంలో గాలి నెమ్మదించడం, టపాకాయలు పేల్చాక వెలువడే పొగలతోనూ గాలి స్తంభించడం, కాలుష్యకారక ధూళి కణాలు గాల్లోనే ఉండిపోవడం ఇందుకు కారణం అవుతున్నాయి. కాలుష్యంతో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ వీవీ రమణ ప్రసాద్‌ (కిమ్స్‌ ఆస్పత్రి), డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల (యశోద ఆస్పత్రి) సాక్షితో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే...

ఇళ్లకే పరిమితం కావాలి
దీపావళి టపాసులతో పెరిగే వాయుకాలుష్య తీవ్రత అనేక సమస్యలకు కారణమౌతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, జబ్బులున్నవారు ఇళ్లకే పరిమితం కావాలి. ఆస్తమా, ఐఎల్‌డీ, బ్రాంకైటిస్‌ రోగులు టపాకాయలు పేల్చొద్దు. చేతులను తరచుగా శానిటైజ్‌ చేయడం కంటే సబ్బు నీటితో కడగాలి. శానిటైజర్లలో అల్కహాలు ఉంటుంది కాబట్టి టపాకాయలకు దగ్గరగా ఉంచకండి.

షేక్‌హ్యాండ్‌ అలవాటుకు దూరంగా ఉంటే మంచిది. నైలాన్, సింథటిక్‌ దుస్తులు వేసుకోవద్దు. సాధారణ టపాసులు కాకుండా గ్రీన్‌ క్రాకర్లు కాల్చాలి. ఈ కాలుష్య ప్రభావంతో దగ్గు, ఆయాసం, ఛాతీ బరువెక్కడం ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమౌతాయి. న్యూమోనియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే.
– డాక్టర్‌ హరికిషన్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top