Covid: కుటుంబాన్ని కాపాడుకున్న యువకుడు

Medak: 5 People In A family Recovered From Corona  - Sakshi

∙కరోనాను జయించి.. ఇంటికి తిరిగొచ్చిన ఐదుగురు సభ్యులు

సాక్షి, మెదక్‌: కరోనా అనగానే సగం ప్రాణం పోతుంది. ఇందుకు తోడు మనోధైర్యం లేకపోవడంతో కరోనా వైరస్‌తో బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. మనోధైర్యం నింపుతూ.. వెన్నంటే ఉండి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు ఓ కొడుకు. తన ఆలోచన, ధైర్యంతో తన ఇంట్లో వెలుగులు నింపుకున్నాడు. ప్రస్తుతం కరోనాను జయించిన కుటుంబీకులు సంతోషంగా ఉన్నారు. జిల్లాలోని రేగోడ్‌ మండల కేంద్రానికి చెందిన ఓ చిరు వ్యాపారవేత్త సాయికిరణ్‌ కుటుంబంలో జరిగిన ఘటన వివరాలు ఆయన మాటల్లోనే..  

మా కుటుంబంలో ఒకరికి ఇరవై ఐదురోజుల క్రితం కరోనా మహమ్మారి సోకింది. నారాయణఖేడ్‌లోని తుర్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో అన్న, చెల్లితో పాటు నేను కరోనా టెస్ట్‌ చేసుకుంటే ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అనే నిర్ధారణ జరిగింది. రెండు రోజుల తర్వాత అమ్మ, నాన్నకు సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని వచ్చిందన్నారు. అనంతరం నాలుగు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వేసుకున్నాం.  

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ అంటువ్యాధా.. డాక్టర్లు ఏమంటున్నారు?

అన్నతో మొదలు.. ఆ తర్వాత అందరికీ   
అన్నతో కరోనా మొదలై తనతో పాటు నాన్న, అమ్మ, చెల్లి కరోనా వ్యాప్తి చెందింది. డాక్టర్‌ సలహా మేరకు నాలుగు రోజులు మందులు వాడాం. కానీ అన్నకు బ్రీతింగ్‌ సమస్య వచ్చింది. ఆ వెంటనే సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో అన్న, నాన్న ఇద్దరినీ చికిత్సకోసం చేర్పించా. నాన్న ఇక్కడ ఐదు రోజులు ఉన్నాడు.  

గంటకు రూ.లక్ష అడిగిండు.. 
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో అన్నకు ఆక్సిజన్‌ పెట్టేందుకు గంటకు లక్ష అడిగిండు. కష్టమయినా ఇస్తా అన్నాను. కానీ తిరిగి పంపించారు. ఆ తర్వాత అన్నను గాంధీ ఆస్పత్రిలో చేర్పించా. అక్కడ ఆరు రోజులు చికిత్స అందించారు. గాంధీలో ఉన్న అన్నకు, సంగారెడ్డి ఆస్పత్రిలో ఉన్న నాన్నకు ఏమీకాదని ధైర్యం చెప్పా. 

నలుగురు నాలుగు చోట్ల..  
అన్న గాంధీలో, నాన్న సంగారెడ్డిలో చికిత్స పొందారు. అమ్మ సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో ఒకరోజు పరీక్షల కోసం.. చెల్లి ఇంటివద్ద ఐసోలేషన్‌లో ఉన్నారు. నాకు కొంత వరకు కరోనా తగ్గడంతో నలుగురు నాలుగు చోట్ల ఉన్నా అందరికీ చికిత్స అందించి కాపాడుకోగలిగాను.  

వెంటిలేటర్‌ కోసం ఎనిమిది గంటలు చక్కర్లు  
హైదరాబాద్‌కు అన్నను తీసుకెళ్లి వెంటిలేటర్‌ కోసం సుమారు ఎనిమిది గంటల పాటు పదిహేను ఆస్పత్రులకు తిరిగాను. కానీ ఎక్కడా లభించలేదు. సుమారు ఐదు వందల ఫోన్‌లు చేశా ఫలితం రాలేదు. చివరకు గాంధీకి వెల్లగానే డాక్టర్‌ మహేశ్‌ సాయంతో వెంటనే బెడ్‌ దొరికింది. మెరుగైన చికిత్స అందించడంతో అన్న త్వరగా కోలుకున్నాడు. చికిత్సతో పాటు అన్న, నాన్న ధైర్యంగా ఉండటంతో కరోనా తగ్గిపోయి ఇంటికి వచ్చారు. అమ్మ, చెల్లి, నాకు హోం ఐసోలేషన్‌లోనే కరోనా తగ్గిపోయింది. కరోనా వచ్చినా ధైర్యాన్ని నింపుకోవడంతో అందరూ సేఫ్‌గా ఇంటికొచ్చారు. మనోధైర్యమే ప్రాణాలతో బయటపడ్డాం. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కరోనా వచ్చినా ఎవరూ అధైర్యపడొద్దు, మనోధైర్యం ఉంటే ప్రాణాలు పదిలంగా ఉంటాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top