అడవి దున్నలు.. ఆయుధంతో మనుషులు

Marvelous Rock Paintings By Adi Manavulu In Yadadri - Sakshi

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం దగ్గర ఆదిమానవుల రాతి చిత్రాల కాన్వాస్‌ వెలుగులోకి ..

సాక్షి, హైదరాబాద్‌: ఆది మానవులు గీసిన అద్భుత రాతి చిత్రాల కాన్వాస్‌ మరొకటి తాజాగా వెలుగు చూసింది. అడవి దున్నలు, వాటిని అనుసరిస్తున్న మనుషుల చిత్రాలు స్పష్టంగా ఉన్న ఈ రాతి చిత్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మధిర గ్రామం కాశీపేట చిన్నరాతిగుట్ట మీద గుర్తించారు. ఇవి సూక్ష్మరాతియుగానికి చెందినవని పరిశోధకులు భావిస్తున్నారు.

తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికి 75 ప్రాంతాల్లో ఆదిమా నవుల రాతి చిత్రాల ప్రదేశాలు కనబడ్డాయి. చాలా ప్రాంతాల్లో వ్యవసాయంలో ప్రధానంగా ఉపయోగపడే పశువులు చిత్రాల్లో కనిపించాయి. ఇవి మూపురాలు కలిగి ఉండటంతో ఎద్దులుగా భావిస్తున్నారు. తాజా చిత్రాల్లో మూపురం లేకుండా ఉన్న జంతువులు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్న ఈ జంతువులు అడవి దున్నలను పోలి ఉన్నాయి.

వీటి వెనుక మానవుల చిత్రాలు గీసి ఉన్నాయి. ఈ అద్భుత చిత్రాలున్న ప్రదేశాన్ని ఔత్సాహిక పరిశోధకులు మహ్మద్‌ నజీర్, కొరివి గోపాల్‌ గుర్తించారు. వీరి సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రతినిధులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, బీవీ భద్రగిరీశ్, అహోబిలం కరుణాకర్, మండల స్వామి, భాస్కర్‌ కలిసి ఈ చిత్రాలను పరిశీలించారు.

ఇలాంటి చిత్రాలు హస్తలాపూర్, అక్షరాలలొద్ది ప్రాంతాల్లో గతంలో కనిపించాయని, దున్నలకు దగ్గరగా గీసి ఉన్న మనిషి చిత్రం లాంటి వి రేగొండ రాతి చిత్రాల తావులోని ఆయుధంతో నిలిచి ఉన్న మనిషిని పోలి ఉన్నాయని పరిశోధకులు హరగోపాల్, బండి మురళీధర్‌రెడ్డి తెలిపారు. వీటికి సమీపంలో కైరన్‌ సిస్టు సమాధులు, ఓ మెన్హిర్‌ కూడా ఉన్నాయన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top