మక్కకు ‘రంగు’దెబ్బ! | Sakshi
Sakshi News home page

మక్కకు ‘రంగు’దెబ్బ!

Published Sat, May 6 2023 12:43 AM

Markfed says not buying soggy and discolored maize - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లకు రంగు దెబ్బ పడింది. తడిసిపోయి రంగు మారిన మొక్కజొన్నను కొ­ను­­గో­లు చేయబోమంటూ మార్క్‌ఫెడ్‌ చేతులెత్తేసింది. దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్న కొంటే తమకు నష్టం వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు.

ఇటీవలి అకాల వర్షాలకు  తడిసిన ధాన్యాన్ని కొనాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని.. అదే తరహాలో మొక్కజొన్నను కూడా కొనాలని కోరుతున్నారు. తడిసి రంగుమారిన మక్కలను మార్క్‌ఫెడ్‌ కొనకపోవడంతో.. వ్యాపారులు అతి తక్కువ ధర ఇస్తున్నారని, తాము నిండా మునుగుతున్నామని వాపోతున్నారు. 

తడిసిన 4 లక్షల టన్నులు 
రెండేళ్లుగా బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్నకు మంచి డిమాండ్‌ ఉండటంతో ఈసారి యాసంగిలో సాగు పెరిగింది. రాష్ట్రంలో యాసంగిలో 6.84 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. మొత్తంగా 17.37 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ గత నెలన్నర రోజుల్లో పలుమార్లు కురిసిన వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా మొక్కజొన్నకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అనేకచోట్ల గింజలు దెబ్బతిన్నాయి.

మొక్కజొన్న తడిసి రంగు మారింది. గింజలు ముడుచుకుపోయాయి. మొత్తంగా 4 లక్షల టన్నుల మేర మొక్కజొన్న రంగు కోల్పోవడమో, గింజ పురుగు పట్టడమో, ముడుచుకుపోవడమో జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. 

మెల్లగా ధర తగ్గించేసి.. 
మొదట్లో నాణ్యమైన పంటకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువే ధర పలికింది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,962 కాగా.. వ్యాపారులు రూ.2,500 వరకు ధర పెట్టారు. కానీ తర్వాత క్రమంగా రూ.1,650కు ధర తగ్గించారు. వర్షాలకు తడిసి, రంగుమారిన మొక్కజొన్నకు కనీసం రూ.1,200 వరకు కూడా ధరపెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. 

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. 
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా 400 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, 8.50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకొని వారం రోజులు దాటినా ఇప్పటివరకు 77 కేంద్రాలే ప్రారంభించారు. అయితే రంగుమారిన, దెబ్బతిన్న మొక్కజొన్నను ఏమాత్రం కొనుగోలు చేసేది అధికారులు చెప్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  

వరిలా మక్కనూ కొనాలి.. 
అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. దీంతో రంగు మారిన వడ్లకు కొనుగోలు సమస్య తలెత్తడం లేదు. కానీ మొక్కజొన్న విషయంలో మార్క్‌ఫెడ్‌ కొర్రీలు పెడుతోందని.. తమ కష్టం దళారుల పాలవుతోందని రైతులు అంటున్నారు. వ్యాపారులు అడ్డగోలు తక్కువ ధర ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు. వరి తరహాలో మొక్కజొన్నను కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
మొక్కజొన్న కొనుగోళ్లపై మార్క్‌ఫెడ్‌ నిబంధనలివీ.. 
తేమ 14 శాతం మించకూడదు 
దెబ్బతిన్న గింజలు 1.5 శాతం మించకూడదు 
రంగుపోయినవి, దెబ్బతిన్నవి 3 శాతం మించకూడదు 
పురుగు పట్టిన గింజలు 1 శాతం మించకూడదు 
ఇతర పంట గింజలు 2 శాతం మించకూడదు 
ఇతర పదార్థాలు 1 శాతం మించకూడదు 

 
రంగు మారితే కొనలేం 
వర్షాలకు దెబ్బతిన్న, రంగు మారిన మొక్కజొన్నను కొనుగోలు చేయడం సాధ్యంకాదు. నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉంటేనే కొనుగోలు చేస్తాం. ఆ పరిధిని దాటి కొనుగోలు చేయడం కుదరదు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు నడుచుకుంటాం. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అవసరమైన చోట్ల ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తుంది. 
– యాదిరెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్‌ 
 
వానలు పడుతున్నాయని కొనడం లేదు 
ఒకటిన్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. దాదాపు 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొన్నటివరకు మార్క్‌ఫెడ్‌ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు చేపట్టలేదు. వానలు మొదలవడంతో కొనుగోలు చేయడం లేదని చెప్తున్నారు. 
– నారెండ్ల రవీందర్‌రెడ్డి, దూలూరు, కథలాపూర్‌ మండలం, జగిత్యాల జిల్లా 
 
తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. మా ఊరు నుంచి కేంద్రానికి తీసుకువచ్చినా వర్షాల కారణంగా తేమశాతం ఎక్కువగా వస్తున్న పరిస్థితి. తడిసిన ధాన్యమంటూ, నిబంధనల ప్రకారం లేదంటూ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. 
– సత్యనారాయణరెడ్డి, సారంగాపూర్‌ మండలం, జగిత్యాల జిల్లా 
 
మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నం 
ఐదెకరాలు కౌలు తీసుకుని మక్క పంట సాగు చేశాను. ప్రభుత్వ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు. అకాల వర్షాలకు మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నాం. 
– చిద్రపు లక్ష్మన్న, కౌలు రైతు, ఖాజపుర్, బోధన్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా 

ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొంటాం..! 
అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్నను కొనడం సాధ్యం కాదని..  అలా కొనుగోలు చేస్తే తమకు నష్టం వస్తుందని మార్క్‌ఫెడ్‌ వర్గాలు చెప్తున్నాయి. పైగా ఆ మొక్కజొన్న దేనికీ పనికి రాదని, ఒకవేళ కొని నిల్వ చేసినా  ఫంగస్‌ వస్తుందని అంటున్నాయి. అయినా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటామని  చెప్తున్నాయి.   

Advertisement

తప్పక చదవండి

Advertisement