
మరో పెద్ద నేతను కోల్పోయిన మావోయిస్టు పార్టీ
పార్టీ కేంద్ర కమిటీసభ్యుడిగా కొనసాగుతున్న సుధాకర్
ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో మృతి
2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు వచ్చిన సుధాకర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ చర్ల: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, విప్లవ రాజకీయ పాఠశాల ఇన్‌చార్జ్ తెంటు లక్ష్మీ నరసింహాచలం (67) మరణించాడు.
ఆయనకు గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ అలియాస్ చంటి అలియాస్ రామరాజు అలియాస్ బాలకృష్ణ అలియాస్ అరవింద్ అనే పేర్లు కూడా ఉన్నాయి.సుధాకర్ పేరుతో పార్టీలో ఆయన సుప్రసిద్ధుడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణించి నెల తిరక్కముందే మరో కీలక నేతను కోల్పోవటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టయ్యింది.
కీలక నేతలున్నారన్న సమాచారంతో..: ఇంద్రావతి అటవీ ప్రాంతంలో సుధాకర్‌తోపాటు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు, మరికొంతమంది కీలక నేతలు ఉన్నారన్న సమాచారంతో ఎస్‌టీఎఫ్, డీఆర్‌జీ, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసు బలగాలు బుధవారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని, అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా సుధాకర్ మృతదేహం లభించిందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
ఘటనా ప్రాంతం నుంచి ఏకే 47 తుపాకీ, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులు బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. సుధాకర్‌పై రూ.40 లక్షల రివార్డు ఉంది. శాంతి చర్చల్లో పాల్గొన్న సుధాకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నక్సలైట్లతో జరిగిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నాడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. సుధాకర్ తండ్రి రామకృష్ణుడు, తల్లి సరస్వతి. వీరికి సుధాకర్ 6వ సంతానం.
సత్యవోలులో సుధాకర్ సోదరుడు తెంటు ఆనందరావు నివసిస్తున్నారు. సుధాకర్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన చింతలపూడి మండలం ప్రగడవరంలో 10వ తరగతి, ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో 1972లో చదువుతున్నప్పుడే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టారు. చివరిసారిగా 1983లో తన తండ్రి అనారోగ్యానికి గురైతే చూడ్డానికి వచ్చి నపుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
జైలు నుంచి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలో 2013లో కేంద్ర కమిటీలో స్థానం దక్కింది. అనంతరం పార్టీ పబ్లికేషన్ విభాగానికి నాయకత్వం వహించాడు. సుధాకర్ 43 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. 2024–25 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 403 మంది మావోయిస్టులు మృతి చెందారని సుందర్‌రాజ్ వెల్లడించారు.