మావోయిస్ట్‌ పార్టీకి ఎదురుదెబ్బ

Maoist Leader Lingu Surrender At Adilabad SP - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : మావోయిస్ట్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు పార్టీ కేబీఎం కమిటీ (కుమురం భీం, మంచిర్యాల) కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేబీఎం కార్యదర్శి అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ కమిటీలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన లింగు గురువారం ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌ ఎదుట సరెండర్‌ అయ్యాడు.  జైనూర్ మండలానికి చెందిన 28 ఏళ్ల లింగు రెండున్నర నెలల కిందటే మావోయిస్టు పార్టీలో చేరాడు. అడేల్లు అలియాస్ భాస్కర్ దళంలో లింగు ఆదిలాబాద్ కమిటీ లో పని చేశాడు. కదంబ ఎన్‌కౌంటర్ తర్వాత లింగు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసులు కలిసి.. లొంగుబాటు నిర్ణయానికి వచ్చాడు. దీనిపై ఎస్సీ మాట్లాడుతూ.. లింగుకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని తెలిపారు. (కదంబా అడవుల్లో అలజడి)

మరికొంత మంది నేతలు కూడా లొంగిపోయే అవకాశం ఉందన్నారు. లింగు లొంగుబాటుకు అడెల్లుకి ఎదురుదెబ్బగా మాజీ మావోయిస్టులు, పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మావోల ఏరివేతే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం సాగుతుండగా పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో మావోలు ఉన్నారు. గతనెల 19న కాగజ్‌నగర్‌ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందగా, ఇందులో ఒకరు చత్తీస్‌గడ్‌కు చెందిన చుక్కాలు కాగా, మరొకరు ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక్‌ బాదీరావు ఉన్నాడు.

కదంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేబీఎం డివిజన్‌ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ తప్పించుకున్న విషయం తెలిసిందే. భాస్కర్‌ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలలుగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్‌ రెడ్డి నేతృత్వంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top