హిడ్మాకూ కరోనా..

Is Maoist Hidma Died With Coronavirus - Sakshi

వైరస్‌కు బలవుతున్న మావోయిస్టులు 

రోజుల వ్యవధిలోనే మరణాలు 

సొంత వైద్యంతోనే పరిస్థితి విషమిస్తోందంటున్న పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టు దళాల ను కరోనా వైరస్‌ వణికిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా మరో అగ్రనేత మాడావి హిడ్మా కూడా కరో నా బారిన పడ్డాడన్న ప్రచారం కలకలం రేపుతోంది. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్‌–1కు కమాండర్‌గా ఉన్న హిడ్మా.. ఏప్రిల్‌ 3న బీజాపూర్‌లో 23 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల ఊచకోతతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడిగా సైతం కొనసాగుతున్న హిడ్మా.. కొంతకాలంగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని, అడవిలోనే అతనికి చికిత్స సాగుతున్నట్టు తమకు సమాచారం ఉందని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంలో మావోయిస్టు పార్టీ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

మూడురోజుల ముందు ఉత్సాహంగానే హరిభూషణ్‌..! 
ప్రస్తుతం దండకారణ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ దాడి అనంతరం మావోయిస్టులు గిరిజనులతో వరుసగా నిర్వహించిన సభలు, సమావేశాల ద్వారా కరోనా వైరస్‌ ఆయా దళాల సభ్యులకు సోకింది. అగ్రనేతలంతా 50 ఏళ్లు పైబడి ఉండటం.., దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతుండటం, వీటికితోడు ప్రమాదకరమైన వైరస్‌ కావడంతో అప్పటిదాకా చలాకీగా ఉన్న వారు కూడా ఉన్నపళంగా మరణిస్తున్నారని సమాచారం. హరిభూషణ్‌ మరణానికి మూ డురోజులు ముందు షేవింగ్‌ కూడా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనికి కంటిచూపు సమస్యలు ఉన్నాయని, అందుకే ఇటీవల కొత్త కళ్లజోడు కూడా తెచ్చుకున్నాడని వివరించారు. సారక్క కూడా ఎక్కువ కాలం అనారోగ్యానికి గురవలేదని, వైరస్‌ సోకిన వారం రోజుల్లోపే మరణించిందని తెలుస్తోంది. 

సొంతవైద్యంతోనే చేటు.. 
వాస్తవానికి గతేడాది మొదటి వేవ్‌లో వైరస్‌ తీవ్రత చాలా తక్కువగా ఉంది. అప్పుడు వైరస్‌ సోకినప్పటికీ... మాత్రలతో తగ్గిపోయింది. కానీ, ప్రస్తుతం వైరస్‌ తీవ్రత పెరిగింది. దీంతో కరోనా చికిత్స క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సొంతవైద్యమే మావోయిస్టుల కొంపముంచుతోంది. కేవలం యూట్యూబ్‌లు, ఆన్‌లైన్‌లో చదివి ఏవో మాత్రలు తెప్పించుకుని వాటినే వాడుతున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, డయాలసిస్, ఆక్సిమీటర్లు, వెంటిలేటర్ల వంటి సదుపాయాలు అడవిలో లభించవు. కేవలం మూడువారాల్లో మధుకర్, కత్తిమోహన్, హరిభూషణ్, సారక్క అకాలమరణం చెందారు. లొంగిపోతే చికిత్స చేయిస్తామని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు చెపుతున్నా.. పార్టీకి మనుగడ ఉండదన్న ఆందోళనతో ముఖ్యనేతలెవరూ ముందుకు రావడం లేదు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top