
సాక్షి, సుభాష్‌నగర్(హైదరాబాద్): మనుమలతో ఇంటి వద్ద సరదాగా గడపాల్సిన వయసులో ఆ వృద్ధుడు ఎండనకా.. వాననకా.. కుటుంబం కోసం తన చెమటను చిందిస్తున్నాడు. గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మ బస్తీకి చెందిన 80 సంవత్సరాల జి.పుల్లప్ప వృద్ధాప్యంలోనూ బండలు కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
ఈ విషయమై ‘సాక్షి’ అతడిని పలకరించగా తనకు ఐదుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారని, రోజంతా కష్టపడి ఇప్పటికి నలుగురు కూతుళ్ల పెళ్లి చేశానని, మరో కూతురు, కొడుకు పెళ్లి చేస్తే తన బాధ్యత తీరిపోతుందని బదులిచ్చారు. పింఛన్ కోసం చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నా రావడం లేదని, అధికారులు స్పందించి నా వంటి వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరాడు.
(చదవండి: చారిత్రక సంపదకు నయా నగిషీలు)