అంకె మార్చినందుకు అరదండాలు! | man alters vehicle number to escape echallans arrested | Sakshi
Sakshi News home page

అంకె మార్చినందుకు అరదండాలు!

Apr 18 2026 8:38 AM | Updated on Apr 18 2026 11:51 AM

man alters vehicle number to escape echallans arrested

సాక్షి,  హైదరాబాద్‌: ట్రాఫిక్‌ పోలీసులు విధించే ఈ–చలాన్లు తప్పించుకునేందుకు తన వాహనం రిజిస్ట్రేష‌న్ నెంబర్‌లోని ఓ అంకెను మార్చిన కూర్మగూడ వాసి మహ్మద్‌ రఫీయుద్దీన్‌ పోలీసులకు చిక్కాడు. సాంకేతిక ఆధారాలతో అతడిని పట్టుకున్న ట్రాఫిక్‌  అధికారులు చాదర్‌ఘాట్‌ పోలీసులకు అప్పగించినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ డి.జోయల్‌ డెవిస్‌ శుక్రవారం వెల్లడించారు.

 రఫీయుద్దీన్‌ వాహనం అసలు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ టీజీ 11 ఏ 1698 కాగా... దానిని తన నెంబర్‌ ప్లేట్‌పై టీజీ 11 ఏ 1898గా మార్చాడు. దీంతో ఇతడు చేసే ఉల్లంఘనలకు సంబంధించిన ఈ–చలాన్లు అన్నీ ‘1898’ వాహనం యజమాని అయిన పద్మానగర్‌ వాసి షహీన్‌ బేగంకు వెళ్తున్నాయి. దీంతో ఆమె ఈ విషయాన్ని ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మార్పును సీరియస్‌గా తీసుకున్న అధికారులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు రఫీయుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని చాదర్‌ఘాట్‌ పోలీసులకు అప్పగించారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు నోటీసులు జారీ చేసి విడిచిపెట్టారు.

 ఇదిలా ఉండగా... ఇలాంటిదే మరో ఉదంతం జూబ్లీహిల్స్‌ పరిధిలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన వడ్లమూడి సురేష్  కుమార్‌ మధురానగర్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ–చలాన్లను తప్పించుకోవడానికి కొన్నాళ్లుగా తన ద్విచక్ర వాహనానికి నకిలీ నెంబర్‌ ప్లేట్‌ అమర్చి తిరుగుతున్నాడు. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడటంతో వాహనాన్ని సీజ్‌ చేసిన ట్రాఫిక్‌ ఎస్సై కే నర్సింహారావు శాంతిభద్రతల విభాగం ఠాణాలో ఫిర్యాదు చేశారు. సురేష్  పై చీటింగ్‌ కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి: 
నకిలీ లేదా మార్పుచేర్పులు చేసిన నంబర్‌ ప్లేట్ల వినియోగం నేరం. అలాంటి వారిపై భారతీయ న్యాయ సంహితతో పాటు మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు అవుతాయి. ఇలాంటి వాహనాలను గుర్తించడానికి ఏఎన్‌పీఆర్‌ సిస్టంతో కూడిన పరిజ్ఞానాన్ని వాడుతున్నాం. ఎవరైనా తమ వాహన రిజి్రస్టేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ దుర్వినియోగం అవుతున్నట్లు అనుమానం వస్తే వెబ్‌సైట్‌ ((https://echallan.tspolice.gov.in),ఈ–మెయిల్‌  (echallanhelpdesk.hyd@gmail.com), ట్రాఫిక్‌ వాట్సాప్‌ నం.8712661690 ద్వారా ఫిర్యాదు చేయండి. 
– జోయల్‌ డెవిస్, ట్రాఫిక్‌ చీఫ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement