మల్లన్న సు‘జలం’ సిద్ధం.. 6.57 లక్షల గృహాలకు తాగునీరు

Mallanna Sagar Drinking Water Scheme Be Implemented Soon - Sakshi

రూ.1,212 కోట్లతో మంగోల్‌ వద్ద 540 ఎంఎల్‌డీ డబ్ల్యూటీపీ నిర్మాణం 

6 జిల్లాల్లో 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలు, 6.57లక్షల గృహాలకు తాగునీరు 

ఇప్పటికే 270 ఎంఎల్‌డీ డబ్ల్యూటీపీ ట్రయల్‌ రన్‌ విజయవంతం 

సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న సాగర్‌ నుంచి గోదావరి జలాలను శుద్ధిచేసి ఆరు జిల్లాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలో 6.57లక్షల గృహాలకు తాగునీటిని అందించే బృహత్తర పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్‌ వద్ద రూ.1,212 కోట్ల వ్యయంతో 540 ఎంఎల్‌డీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (డబ్ల్యూటీపీ) నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. 270 ఎంఎల్‌డీ చొప్పున రెండు ప్లాంట్‌లను నిర్మించగా, ఒక ప్లాంట్‌ పూర్తికావడంతో సోమవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మరో 270ఎంఎల్‌డీ డబ్ల్యూటీపీ పనులు ఆగస్టులో పూర్తికానున్నాయి. 

మల్లన్నసాగర్‌ నుంచి 7.26టీఎంసీల నీరు.. 
కొమురవెల్లి మల్లన్నసాగర్‌ను 50టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేలా నిర్మించారు. ఏటా 7.26టీఎంసీల నీటిని తాగునీటిగా వినియోగించాలని నిర్ణయించారు. రా వాటర్‌ను శుద్ధి చేసేందుకు కుకునూరుపల్లి మండలం తిప్పారం వద్ద ఆరు మోటార్ల ద్వారా 5.6 కిలోమీటర్ల పైప్‌లైన్‌తో మంగోల్‌లోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు చేరుస్తారు. 540 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే) సామర్థ్యంతో రెండు నీటి శుదీ్ధకరణ ప్లాంట్‌లు ఒక్కోటి 270 ఎంఎల్‌డీ చొప్పున నిర్మించారు.

మల్లన్నసాగర్‌ నుంచి వచ్చిన నీళ్లు మంగోల్‌ వద్ద శుదిŠధ్‌ చేసి, 3 కిలోమీటర్ల దూరంలోని లకుడారంలో 6 ఎంఎల్‌(మిలియన్‌ లీటర్లు) సామర్థ్యం కలిగిన గ్రౌండ్‌ లెవల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (జీఎల్‌బీఆర్‌)లోకి పంపిస్తారు. ఇందుకు జీఎల్‌బీఆర్‌ వద్ద రెండు పాయింట్స్‌ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొమురవెల్లి కమాన్‌ వద్ద ఉన్న ట్యాంక్‌లోకి తరలిస్తారు. అక్కడి నుంచి జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాలకు తాగునీరు అందుతుంది. 

అక్కారంలోని నాలుగు పాయింట్ల నుంచి..  
కొమురవెల్లి కమాన్‌ నుంచి మరో పాయింట్‌ ద్వారా 29 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట నియోజకవర్గానికి నీటిని తరలిస్తారు. లకుడారం నుంచి 16 కిలోమీటర్ల దూరంలోని అక్కారం వద్ద 6ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన సంపులోకి పంపిస్తారు. అక్కారం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు పాయింట్లలో.. ఒక పాయింట్‌ నుంచి 33.6 కిలోమీటర్ల దూరంలోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘనపురం గుట్టకు నీటిని పంపింగ్‌ చేస్తారు. ఈ గుట్ట నుంచి మేడ్చల్, ఆలేరు, భువనగిరికి ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్‌తో నీటిని పంపిస్తారు.

రెండో పాయింట్‌ను 5.4 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్‌ కోమటిబండ లైన్‌కు కలుపుతారు. ఇక్కడి నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు మెదక్‌ జిల్లాలోని కొన్ని మండలాలకు ఈ జలాలు వెళ్తాయి. మూడో పాయింట్‌ నుంచి సంగాపూర్‌ వద్ద నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు తరలిస్తారు. నాలుగో పాయింట్‌ను భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గానికి పంపింగ్‌ చేయనున్నారు. 

6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు 
మొత్తంగా మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలు ఆరు జిల్లాలలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలోని 6,57,203 గృహాలకు తాగునీటిని అందించనున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 4,81,217 గృహాలకు నీటి సరఫరా కానున్నాయి. సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, మేడ్చల్, దుబ్బాక, ఆలేర్, జనగామ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుప్రాన్, మోత్కూర్, పోచంపల్లి, ఘట్‌కేసర్, దిండిగల్, గుండ్ల పోచంపల్లి, తిరుమలగిరి పట్టణాల్లో 1,75,986 గృహాలకు నీటిని సరఫరా చేస్తారు.

జూలై నాటికి సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో 439 ఆవాసాలకు, గజ్వేల్, దుబ్బాక, తుప్రాన్‌ మున్సిపాలిటీలకు, ఆగస్టు నాటికి మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో 611 ఆవాసాలు, ఘట్‌కేసర్, మేడ్చల్, దుండిగల్, గుండ్లపోచంపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీలకు తాగు నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 

నెల రోజుల్లో సరఫరా 
డబ్ల్యూటీపీ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ఈ ప్లాంట్‌ ద్వారా నెల రోజుల్లో పంపింగ్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు నాటికి 6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు మల్లన్న సాగర్‌ నుంచి శుద్ధిచేసిన గోదావరి జలాలను సరఫరా చేస్తాం. 
– రాజయ్య, మిషన్‌ భగీరథ గ్రీడ్‌ ఈఈ
చదవండి: టీఎస్‌పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top