హుస్నాబాద్‌లో విస్త‘రణం’ | - | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌లో విస్త‘రణం’

Mar 4 2026 9:01 AM | Updated on Mar 4 2026 9:01 AM

అభివృద్ధి పేరిట మా ఇళ్లు కూల్చితే సహించం

బాధితుల ఆగ్రహం

హుస్నాబాద్‌: చెరువు కోసం రోడ్ల విస్తరణ చేసి పేదల ఇళ్లను కూల్చేస్తే ఊరుకోబోమని స్థానికులు హెచ్చరిస్తున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్ల విస్తరణకు ప్రభుత్వం రూ.2.49 కోట్లు నిధులు మంజూరు చేసింది. కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు 25 ఫీట్ల వెడల్పు ఉంది. విస్తరణలో భాగంగా సెంటర్‌ పాయింట్‌ నుంచి ఎటు 40 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు మార్కింగ్‌ కూడా వేశారు. ఇళ్లకు ఎక్కువ స్థాయిలో నష్టం జరగకుండా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్కింగ్‌తో కొన్ని ఇళ్లు పూర్తిగా కోల్పోతుండగా, మరి కొన్ని సగం వరకు రోడ్డు విస్తరణలో నేలమట్టం కానున్నాయి.

రోడ్ల విస్తరణకు మార్కింగ్‌

ప్రభుత్వం రూ.18కోట్ల వ్యయంతో ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మ ఘాట్‌, చెరువు కట్టపై సీసీ రోడ్లు, అందమైన బొమ్మల నిర్మాణాలు, గ్లాస్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా, మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్ల విస్తరణ పనులను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి పెంకుటిల్లు, గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. ముందు ఇంటి స్థలంతో పాటు ఇళ్లను కట్టించిన తర్వాతే మా ఇళ్ల జోలికి రావాలని తేగేసి చెబుతున్నారు. కూలీ పనులు చేస్తేనే ఫూట గడిచే పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నామని, ఇప్పుడు ఇళ్లు తొలగిస్తే ఎటు పోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్ల విస్తరణకు

మార్కింగ్‌ వేసిన అధికారులు

ఇల్లు జాగ పోతాంది

రోడ్ల విస్తరణ పనులకు అధికారులు మార్కింగ్‌ చేశా రు. దీంతో మా ఇల్లు, జాగ మొత్తం పోతాంది. మెయిన్‌ రోడ్‌లో ఉన్న మమ్ములను ఎక్కడికో తీసుకెళ్తానంటే సాధ్యం కాదు. స్థలం, ఇంటి నిర్మాణ పట్టాలు ఇచ్చిన తర్వాతే మా ఇళ్లను ముట్టుకోవాలి.

– రేణుక, హుస్నాబాద్‌

చెరువు కట్టపైనే ఇల్లు నిర్మించాలి

అరవై ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే బతుకుతన్న, దిక్కు లేని అనాథను. వెను కా ముందు ఎవరు లేరు. ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తే ఎక్కడికి పోవాలే. ఎల్లమ్మ చెరువు కట్టపై ఇళ్లు కట్టించాలి. లేదంటే ఇళ్లను కూల్చనివ్వం.

–లచ్చమ్మ, హుస్నాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement