గర్భస్రావాలు | - | Sakshi
Sakshi News home page

గర్భస్రావాలు

Mar 4 2026 9:01 AM | Updated on Mar 4 2026 9:01 AM

ఆందోళన కలిగిస్తోన్న

గర్భస్రావం (మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ–ఎంటీపీ) కేసుల నమోదు వృద్ధి రేటు తెలంగాణలో గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఐదేళ్లలో ఏకంగా 900% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో రాష్ట్రవ్యాప్తంగా 16,059 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ (డీసీఏ) రాష్ట్రంలో గర్భ నిరోధక మాత్రల వినియోగంపై దృష్టి సారించింది. అన్‌వాంటెడ్‌ కిట్‌గా పిలుచుకునే ఈ మాత్రలు హిమాచల్‌ప్రదేశ్‌, గోవా వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నట్లు డీసీఏ గుర్తించింది. ఈ మాత్రల వినియోగంపై జిల్లాల్లోని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల ద్వారా ఆరా తీస్తోంది. ఈ అన్‌వాంటెడ్‌ కిట్స్‌ ఏయే మెడికల్‌ ఏజెన్సీలకు సరఫరా అయ్యాయి? వాటిని ఏ మెడికల్‌ షాపులకు విక్రయించారు? లేదా ఆస్పత్రులకు పంపారు? ఈ మాత్రలు ఎవరికి ఇచ్చారు? వంటి వివరాలను డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు సేకరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం 15 మెడికల్‌ షాపులనైనా చెక్‌ చేస్తున్నామని మెదక్‌ జిల్లాకు చెందిన ఓ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

నిబంధనలకు విరుద్ధంగా వినియోగం

గర్భస్రావం మాత్రలు నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ మాత్రలను మెడికల్‌ షాపుల్లో విక్రయించడానికి వీలు లేదు. గైనకాలజీ వైద్యసేవలందించే ఆస్పత్రులు మాత్రమే వీటిని వినియోగించాలి. కానీ, రాష్ట్రంలో వీటి వినియోగం విచ్చలవిడిగా సాగుతోందనే విమర్శలున్నాయి. పీఎంపీలు, ఆర్‌ఎంపీల సూచనల మేరకు వీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే గర్భందాల్చిన నిర్ణీత సమయంలోపే వీటిని వినియోగించాలి. కానీ నెలలు నిండాక కూడా వీటిని వాడటంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరైతే శాశ్వతంగా మాతృత్వాన్ని కోల్పోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

పల్లెల్లోనూ అన్‌వాంటెడ్‌ కిట్ల వినియోగం

దృష్టి పెట్టిన డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ

తనిఖీలు చేస్తున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు

నగరాల్లో అత్యధికంగా నమోదు

గర్భస్రావాల కేసులు పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి వంటి జిల్లాల్లో ఎక్కువగా ఎంటీపీ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉండటమే కారణమని భావిస్తున్నారు. ఈ మూడు జిల్లాలో ఏటా సగటున 2,500 నుంచి 5,200 కేసులు నమోదవుతుండటం గమనార్హం. గ్రామీణ, అత్యంత మారుమూల ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఏటా 100 నుంచి 300 కేసులు రికార్డవుతున్నాయి. ఇక్కడ సరైన స్పెషలిస్టు వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో సమీప పట్టణాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఏటా 1000 కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement