మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు అనల్‌దా...
భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం
ఒక్కొక్కరుగా ఒరుగుతున్న ఎంసీసీ అగ్రనేతలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా చోటానాగ్రా పోలీస్‌స్టేషన్ పరిధిలో కుంబాదీహ్ గ్రామ సమీపంలో గల చైబాస అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరాం మాంఝీ అలియాస్ అనల్‌దా మృతి చెందాడు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది.
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతోపాటు నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో అనల్‌దా మృతిచెందినట్టు కొల్హాన్ డివిజన్ డీఐజీ అనురంజన్ కిస్పొట్టా ధ్రువీకరించారు. జార్ఖండ్‌లోని పిట్రాండ్‌కు చెందిన అనల్‌దా 1987 నుంచి క్రియాశీలకంగా ఉన్నాడు.
టార్గెట్ మిసిర్‌బెహ్రా
ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మావోయిస్టులకు దండకారణ్యంలో ఉన్న సేఫ్ జోన్లు క్రమంగా ప్రమాదంలో పడ్డాయి. దీంతో ఒకప్పటి పీపుల్స్‌వార్‌కు చెందిన మావోయిస్టుల్లో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలకు చేరుకోగా, మావోయిస్టు పార్టీలో విలీనమైన ఎంసీసీ (మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్)కి సంబంధించిన కీలక నేతలు ఒడిశా–జార్ఖండ్ సరిహద్దులో విస్తరించిన శరందా అడవులను షెల్డర్ జోన్‌గా మార్చుకున్నారు.
చోటానాగ్రా సమీపంలోని దట్టమైన అడవుల్లో మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెహ్రా ఉన్నాడనే సమాచారంతో బుధవారం రాత్రి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ మొదలు పెట్టాయి.
అంబూష్ ను ఛేదించి
ఇప్పటికే దండకారణ్యంపై పట్టు కోల్పోయిన మావోయిస్టులు శరందా అడవులను చేజార్చుకోవద్దనే ఉద్దేశంతో ఉన్నారు. ఆకురాలే కాలం మొదలైన తర్వాత కచి్చతంగా భద్రతా దళాలు అడవిలోకి వస్తాయనే అంచనాతో అంబూ ష్ దాడికి వల పన్నారు. దీంతో గురువారం ఉదయం చై బాస దగ్గర ఇరువర్గాలు ఎదురుపడటంతో కాల్పులు మొ దలయ్యాయి.
విడతల వారీగా చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు అనల్‌దాతోపాటు మరో 15 మంది మావోయిస్టులు మరణించారు. అగ్రనేత అనల్‌దాను భద్రతా దళాలు గుర్తించగా, మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. మావోయిస్టులు అంబూష్ ఏర్పాటు చేసిన ప్రాంతం కావడంతో భద్రతా దళాలు ఆచితూచి సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో పోలీసు, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 1,500 మంది బలగాలు పాల్గొన్నాయి.
ఒక్కొక్కరుగా..
దేశంలో సాయుధ పోరాట పంథాను అనుసరిస్తున్న విప్లవ పార్టీల్లో ప్రధానంగా ఉత్తర భారత దేశానికి చెందిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసీసీ), ఉమ్మడి ఏపీకి చెంది న పీపుల్స్‌వార్ (పీడబ్ల్యూ) పార్టీలు విలీనం కావడంతో 2004లో సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పాటైంది. అయితే, ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఇటు ఎంసీసీతోపాటు అటు పీడబ్ల్యూకు చెందిన సీనియర్ నాయకులు వరుస ఎన్‌కౌంటర్లలో చనిపోతున్నారు.
జార్ఖండ్‌లో గత ఏప్రిల్‌లో జరి గిన ఎన్‌కౌంటర్‌లో ప్రయాగ్‌మాంఝీ మృతిచెందగా ఆ త ర్వాత సెప్టెంబర్‌లో పర్వేశ్ మరణించారు. ఇప్పుడు అనల్ దా కూడా చనిపోయాడు. దీంతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఎంసీసీకి చెందిన కీలక నేతల్లో పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెహ్రా మినహా మిగిలిన అగ్రనేతలు మరణించినట్టయింది.
ఇటు పీడబ్ల్యూకు సంబంధించి తిప్పిరి తిరుపతి ఒక్కరే ఆ పార్టీకి చివరి ఆశగా మిగిలాడు. సీనియర్ నేతలు గణపతి, సంగ్రామ్, విశ్వనాథ్‌లు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ కేడర్ నుంచి పాపారావు దండకారణ్యంలో ఆ పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాడు.
హింసను వీడాలి: అమిత్‌షా
మావోయిస్టులు హింసాత్మక భావజాలాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. నక్సల్‌రహిత సమాజాన్ని సాధించడంలో సంయుక్త బలగాలు మరో భారీ విజయం సాధించాయని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దేశంలో మార్చి 31 లోగా నక్సలిజాన్ని పారద్రోలాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.


