నీలకంథరా దేవా..

Maha Shivaratri Celebrations In Grand Style At Vemulawada Rajanna Temple - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు 

ఎములాడ రాజన్న ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు  

స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల  

దర్శనానికి 2 లక్షలమంది రాక.. కోడెమెుక్కులు తీర్చుకున్న భక్తులు 

వెలుగులీనిన ‘వేయిస్తంభాలు’ 

వేములవాడ/వరంగల్‌/నాగర్‌కర్నూలు: ఉదయమంతా శివయ్య దర్శనాలు.. రాత్రి జాగరణలు.. ‘ఓం నమఃశివాయ’నామస్మరణతో మంగళవారం రోజంతా శివాలయాలు మార్మోగాయి. పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇటు వేములవాడ రాజన్న.. అటు వేయిస్తంభాల ఆలయం లోని రుద్రేశ్వరుడు.. మరోపక్క చెంచుల మల్లికార్జునుడు.. భక్తజన దర్శనాలతో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లయకారుడు లింగాకారుడై ఉద్భవించిన పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం స్వామికి మహాలింగార్చనను స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ఘనంగా నిర్వహించింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీసీ సంక్షేమమంత్రి గంగుల కమలాకర్‌ ప్రభుత్వపక్షాన స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.

అంతకుముందు తిరుమల తిరుపతి వెంకన్న తరఫున టీటీడీ ఏఈవో మోహన్‌రాజు, వేదమూర్తులు సూర్యనారాయణశాస్త్రి, జితేశ్‌ల బృందం రాజన్నకు పట్టువస్త్రాలను సమర్పించారు. ‘కొడుకునియ్యి రాజన్నా..నీకు కోడెను గడుతాం రాజన్నా..’ అని గీతాలాపన చేస్తూ 2 లక్షలమంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. సాయంత్రం 6 గంటలకు వేదమూర్తులతో మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు.  

దర్శనానికి 6 గంటలు 
సోమవారం అర్ధరాత్రి 12 నుంచి మంగళవారం వేకువజామున 3.30 వరకు స్థానికుల దర్శనాల అనంతరం లఘుదర్శనాలను కొనసాగించారు. దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టింది. దీంతో క్యూలైన్లలో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆరోగ్యసిబ్బంది సేవలందించారు. భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షవర్ల వద్ద స్నానాలు చేసి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గుడిచెరువులో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, రాజన్న దర్శనంలో మంగళవారం దాదాపు ఆరుసార్లు బ్రేక్‌ విధించారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది.  

వేయిస్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. నగరంలోని వేయిస్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. ప్రధాన దారినుంచి రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులుదీరారు. రాత్రి శ్రీ రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరదేవీ కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణంలో పాల్గొన్నారు. కాళేశ్వరంలో భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో పెద్దపట్నం వేశారు. రాత్రి స్వామి కల్యాణం జరిగింది. కురవి వీరన్న ఆలయంలో కల్యాణం వైభవంగా జరిగింది.  

పిల్లలమర్రి కిటకిట...
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని శివాలయం మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే దర్శనాలు, అభిషేకాలు నిర్వహించేందుకు భక్తులు బారులుదీరారు. అనంతరం రాత్రి స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top