ఈసారి గతానికి భిన్నంగా.. మరో ఛాన్స్‌ లేదు గురూ! | Telangana Local Body Elections 2025: Single Notification Brings Buzz in Villages | Sakshi
Sakshi News home page

ఈసారి గతానికి భిన్నంగా.. మరో ఛాన్స్‌ లేదు గురూ!

Sep 30 2025 12:48 PM | Updated on Sep 30 2025 12:59 PM

local body elections in a single phase In Telangana

‘స్థానిక’ంలో ఒకే దఫా అన్ని ఎన్నికలు

ఓడి, గెలిచేందుకు అవకాశమే లేదు

వరుసగా ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలు

సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గతానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఆశావహులు ఒక్కసారిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

గతానికి భిన్నంగా..
గతంలో ముందుగా ఒక్క నోటిఫికేషన్‌ జారీ అయ్యేది. అయితే ఎంపీటీసీ ఎన్నికలు, లేదా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఏదో ఒక్కటి ముందు జరిగేవి. ఇలా జరగడం మూలంగా ముందుగా వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి, దరి దాపుల్లోకి వచ్చి ఓడిపోయినవారు.. మరోసారి వెంటనే వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉండేది. కానీ ఈ సారి “సానుభూతి’ చాన్స్‌ లేకుండానే నేరుగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఫలితంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు “సానుభూతి’ని మూటగట్టుకునే చాన్స్‌ లేకుండా పోయింది. రెండు ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలి పరిస్థితి నెలకొంది. రెండింటికీ పోటీ చేస్తే.. నెగెటివ్‌ ఫలితాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మొదటి ఎన్నికల్లో ఓడి.. రెండో ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఈ సారి లేవు. గతంలో చాలా మంది అభ్యర్థులు సర్పంచ్‌ పదవికి ఓడిపోయి, మళ్లీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచారు. ముందుగా ఎంపీటీసీగా ఓడిపోయి, తర్వాత సర్పంచ్‌గా గెలిచిన ఘటనలు ఉన్నాయి. ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.

పార్టీ నేతలకు తలపోట్లు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి అటు ఎంపీటీసీ, సర్పంచ్‌ అభ్యర్థులను ఆయా పార్టీ నేతలు ఎంపిక చేయాల్సి వస్తుంది. రెండు వేర్వేరుగా నోటిఫికేషన్లు వస్తే.. ఆయా పార్టీలకు కొంత సమయం దొరికి అభ్యర్థుల ఎంపిక సులభంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఏకకాలంలో ఎన్నికలు రావడంతో ఒక్క ఊరిలో ఎంపీటీసీ అభ్యర్థిని, సర్పంచ్‌ అభ్యర్థిని, మండల స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిని, మళ్లీ గ్రామస్థాయిలో వార్డు సభ్యులను ప్యానల్‌గా నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని పార్టీలకు ఈ జమిలి నోటిఫికేషన్‌ తలనొప్పిగా మారింది.

రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్‌
రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబరు 11న నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కాగా, అక్టోబరు 23న ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలకు అక్టోబరు 15న నామినేషన్లకు చివరి రోజు. 27న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబరు 11న వెలువడుతాయి. 

ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల కోసం పక్షం రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అక్టోబరు 31, నవంబరు 4, 8వ తేదీల్లో మూడు విడతల్లో పూర్తి కానున్నాయి. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే ఫలితాలు వెలువడుతాయి. మొత్తంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేస్తూ ఎన్నికల కోడ్‌ను అమలులోకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement