ఇంజెక్షన్‌ ఖరీదు రూ.16 కోట్లు.. చిట్టి తల్లికి పెద్ద కష్టం

Little Girl Suffering With SMA Type 3 Disease In Kachiguda - Sakshi

నాలుగేళ్ల చిన్నారికి అరుదైన వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి 

కోట్ల మందిలో ఒక్కరికి వచ్చే ఎస్‌ఎంఏ టైప్‌ – 3 

దీని చికిత్సకు అవసరమైన ఒక ఇంజెక్షన్‌ ఖరీదు రూ.16 కోట్లు 

 దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు 

కాచిగూడ (హైదరాబాద్‌): చిన్న వయస్సులోనే పెద్ద వ్యాధితో బాధ పడుతోంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయస్సులో ఈ చిన్నారి మంచానికి అతుక్కుపోతోంది. బుడిబుడి అడుగులతో, బోసి నవ్వులతో సందడి చేసిన తమ కలల పంట ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. ఆమె వైద్యానికి అవసరమైన ఒక్క ఇంజెక్షన్‌ ఖరీదు రూ.16 కోట్లు కావడంతో.. దయగల దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని ప్రాధేయపడుతున్నారు.  

అరుదైన వ్యాధి ఎస్‌ఎంఏ– 3 
హైదరాబాద్‌ కాచిగూడ ప్రాంతానికి చెందిన దోషిలి వినయ్, శిల్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె సాన్వి జన్యు సంబంధమైన వెన్నెముక కండరాల క్షీణత (ఎస్‌ఎంఏ టైప్‌ –3) వ్యాధితో పోరాడుతోంది. సాన్వి కొంతకాలం నుంచి సరిగ్గా నడవలేక పోతుండటంతో వైద్యులకు చూపించగా నరాల బలహీనత ఉందని చెప్పి మందులు వాడాలని, ఫిజియోథెరపీ చేయించాలని చెప్పారు.

వారి సూచనల మేరకు వైద్యం చేయిస్తూ, ఫిజియోథెరపీ చేయిస్తున్నా చిన్నారి ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇటీవల నిమ్స్‌ ఆసుపత్రిలో జెనిటిక్‌ వైద్య నిపుణురాలు డాక్టర్‌ ప్రజ్ఞా రంగనాథన్‌ వద్ద చూపించారు. అన్ని రకాల వైద్య పరీక్షల అనంతరం సాన్వి.. కోట్ల మందిలో ఏ ఒక్కరికో వచ్చే ఎస్‌ఎంఏ టైప్‌ 3 వ్యాధితో బాధపడుతున్నట్టుగా వైద్యులు నిర్ధారించారని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం రెయిన్‌బో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ రమేష్‌ పర్యవేక్షణలో ఇంటి వద్దే చికిత్స చేయిస్తున్నామని చెప్పారు.  

ఇంజెక్షన్‌ ఇవ్వకపోతే జీవితాంతం మంచంపైనే.. 
ఈ వ్యాధి కోసం ఇవ్వాల్సిన ఇంజక్షన్‌ ఖరీదు రూ.16 కోట్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారని సాన్వి తల్లిదండ్రులు తెలిపారు. పైగా అది ఇక్కడ దొరకదని, విదేశాల నుంచి తెప్పించాల్సి ఉంటుందని, జీఎస్‌టీతో కలుపుకొని దాదాపు రూ.22 కోట్లు అవుతుందని చెప్పారు. ఐదు సంవత్సరాల వయస్సు లోపే తమ చిన్నారికి ఈ ఇంజెక్షన్‌ వేయించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు విలపిస్తూ తెలిపారు. ఇటీవల నగరానికే చెందిన ఆయాన్స్‌ గుప్తాకు నిధుల సమీకరణ ద్వారా ఆ ఇంజెక్షన్‌ తెప్పించి ఇచ్చారని, జీఎస్‌టీని ప్రభుత్వం మినహాయించిందని సాన్వి తల్లిదండ్రులు తెలిపారు.   

తక్కువ సమయమే ఉంది 
తమ కుమార్తెకు చికిత్స ప్రారంభించడానికి తక్కువ సమయం మాత్రమే ఉందని వినయ్, శిల్ప తెలిపారు. నాలుగు నెలల్లో ఇంజెక్షన్‌ ఇస్తేనే సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. దాతలు తాము చేయగలిగినంత సాయం చేసి (బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ : 50100421831334, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: హెచ్‌డీఎఫ్‌సీ 000024, గూగుల్‌ పే, ఫోన్‌ పే, పే టీఎం నంబర్‌ : 9618779839) తమ చిన్నారిని కాపాడాలని వారు కోరుతున్నారు.
చదవండి: నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top