సర్దార్‌ పాపన్నగౌడ్‌ ఆశయాలను కొనసాగిస్తాం

Let continue the ambitions of Sardar Papannagoud - Sakshi

పాపన్నగౌడ్‌ జయంతి సభలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 

పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ ఎంపీ భరత్‌గౌడ్‌  

గన్‌పౌండ్రీ (హైదరాబాద్‌): సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశయాలను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్‌ పాపన్న మహారాజ్‌ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్‌ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్‌ సర్వాయ్‌ పాపన్న గౌడ్‌ మహరాజ్‌ 373వ జయంతి జాతీయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ కులస్తుల అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు.

పాపన్న చరిత్ర తెలుసుకుంటే జాతిపట్ల అప్పట్లో ఎంత వివక్షత ఉందో తెలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గౌడ్‌ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని పెట్టేందుకు జీవో జారీ చేశామని హెచ్‌ఎండీఏ అధికారులు స్థలాన్ని అన్వేషీస్తున్నట్లు వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్‌ మాట్లాడుతూ, బహుజనులంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు భరత్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు.

75 సంవత్సరాల రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి పార్లమెంటుకు ఎంపిక కావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్‌ బయోపిక్‌పై రూపొందించిన సినిమా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్‌ కె.స్వామిగౌడ్, మాజీ పార్లమెంట్‌ సభ్యులు మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌ గౌడ్, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ పల్లే రవికుమార్‌గౌడ్, జై గౌడ్‌ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వి.రామారావుగౌడ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top