
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు బలిహరణ, అనంతరం ఉదయం మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మహాభిషేకం జరిగింది. తదనంతరం బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది.
బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పట్టు వ్రస్తాలు సమర్పించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణ సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయన్నారు. గోల్కొండలో మొదలైన ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతున్నాయి. బోనాలు ప్రశాంతంగా అత్యంత భక్తి భావంతో కొనసాగుతున్నాయి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలను చల్లగా చూడమని వేడుకున్నాను. దాదాపు రూ.1290 కోట్లతో దేవాదాయ శాఖకు నిధులు విడుదల చేశాం. రూ.20 కోట్లు హైదరాబాద్‌లో బోనాల కోసం నిధులు విడుదల చేశాం. మహంకాళి అమ్మవారి ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమర్క తెలిపారు.
కాగా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆలయాల పరిసరాల్లో బాంబు, డాగ్ స్క్వాడ్, నిఘా వర్గాలు భారీగా మోహరించాయి. దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా, అదనపు డీసీపీ మజీద్, ఛత్రినాక ఏసీపీ సి.హెచ్.చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మ లు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
