మా ధనం కావాలి.. ధాన్యం వద్దా..? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్‌ 

KTR Slams Centre Over Rice Procurement - Sakshi

ఏడున్నర ఏళ్లలో ఏ సాయం చేయలేదు

కేంద్ర ప్రభుత్వ వైఖరి తేలేదాకా వరి వేయొద్దు

మానేరు వాగులో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరామర్శ

సిరిసిల్ల: ‘రాష్ట్రం పన్నుల రూపంలో అందించే ధనం కావాలి.. కానీ మా రైతులు పండిస్తున్న ధాన్యం మాత్రం వద్దా?’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్రాన్ని ప్రశ్నిం చారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు.

దేశానికి ఆర్థికంగా అండగా ఉండే రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, రాష్ట్రం అతిపెద్ద ఆర్థిక వనరుగా అవతరించిందని ఆర్‌బీఐ నివేదికే చెబుతోందని పేర్కొన్నారు. ఏడున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ సాయమూ చేయలేదన్నారు. కాళేశ్వరం కట్టినా పైసా ఇవ్వలేదన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేం త వరకు వరి వేయొద్దని మంత్రి రైతులను కోరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఉలుకూ.. పలుకులేదన్నారు. కేంద్రం వైఖరిని దేశం ముందు ఉంచేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు గురువారం ధర్నా చేస్తున్నారని తెలిపారు. 

వానాకాలం వడ్లు కొంటున్నాం.. 
రాష్ట్రంలో 4,743 కొనుగోలు కేంద్రాల ద్వారా వానాకాలం వడ్లను కొంటున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పుష్కలమైన సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు ఎలా నష్టం చేస్తుందని, ఈ విషయంలో రైతన్నలు ఆలోచించాలని కోరారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యవసాయాన్ని దెబ్బతీస్తామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు.  

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం 
సిరిసిల్ల మానేరు వాగులో ఈతకు వెళ్లి మృతిచెందిన పిల్లల కుటుంబాలను మంత్రి కేటీఆర్‌ బుధవారం సాయంత్రం పరామర్శించారు. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌ ప్రాంతంలో ఉంటున్న జడల వెంకటసాయి, సింగం మనోజ్‌కుమార్, తీగల అజయ్‌కుమార్, శ్రీరాముల క్రాంతికుమార్, కొంగ రాకేశ్‌ కుటుంబాలను ఓదార్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు.

ఈ ఘటన దురదృష్టకరమని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. మంత్రి వెంట జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top