హిట్లర్‌ ఆదర్శం కాబట్టే అరాచకాలు | KTR comments on Revanth Reddy | Sakshi
Sakshi News home page

హిట్లర్‌ ఆదర్శం కాబట్టే అరాచకాలు

Jun 8 2026 5:26 AM | Updated on Jun 8 2026 5:26 AM

KTR comments on Revanth Reddy

రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన ’హైడ్రా’ ఒక హంతక ముఠా లాంటిది.. 

ఎక్స్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్‌ ఆదర్శం కాబట్టే రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచకాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బెంగళూరు వేదికగా జరిగిన ’ది హిందూ’ సదస్సులో (ది హిందూ కాన్‌క్లేవ్‌) సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్‌ హిట్లర్‌ చర్యలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ ఆదివారం స్పందించారు. రేవంత్‌రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్‌ మనస్తత్వం ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమైందని ఎద్దేవా చేశారు. ‘మీకు స్ఫూర్తి హిట్లర్‌ ముమ్మాటికి నిజమేం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఒక అస్సాసినేషన్‌ ఏజెన్సీ (హంతక ముఠా) లాంటిది! మీరు నియంతలను పూజిస్తారు, పేదల ఇళ్ల కూల్చివేతలను గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోతారు.

తెలంగాణ ప్రజలకు మీ నియంత నైజం ముందే తెలుసు.. ఇప్పుడు మీ నోటితోనే మీ ఫాసిస్ట్‌ ఆలోచనలను దేశం మొత్తానికి స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు రేవంత్‌రెడ్డి’అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి.. మీలాంటి హిట్లర్‌ ఆలోచనలు చేసేంత మేధావులం మేము కాదు. అందుకే, మా పదేళ్ల పరిపాలనను మేము డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మాగాంధీ చూపిన అహింసామార్గంలో, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ కన్న కలల ఆశయాల ప్రాతిపదికన నడిపించాం’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement