సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించాక రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన

Krishna Board Committee Appointing Another To Replace - Sakshi

ఎన్జీటీకి ఇచ్చిన మధ్యంతర నివేదికలో కృష్ణా బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ప్రతినిధి సీఈ దేవేందర్‌రావు స్థానంలో మరొకరిని నియమించాక, కమిటీ ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించి, నివేదిక ఇస్తామని వివరించింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) చెన్నై బెంచ్‌కు నివేదించింది. తుది నివేదిక సమర్పించేందుకు 3 వారాల గడువు ఇవ్వాలని శుక్రవారం ఎన్జీటీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే మధ్యంతర నివేదిక ఇచ్చారు. రాయలసీమ పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించామని నివేదికలో పేర్కొన్నారు.

సీడబ్ల్యూసీ తరఫున కృష్ణా–గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ (కేజీబీవో)లో సీఈగా పనిచేస్తున్న పి.దేవేందర్‌రావుతో పాటు కృష్ణా బోర్డు అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 5న ఆ ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తెలంగాణకి చెందిన దేవేందర్‌రావు ను కమిటీలో నియమించడంపై ఈ నెల 3న ఎన్జీటీ వద్ద ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని వివరిం చారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలతో సంబం ధం లేని అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఈనెల 4న ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో దేవేందర్‌రావు స్థానంలో అదేస్థాయి అధికారిని నియమించాలంటూ సీడబ్ల్యూసీని కోరినట్లు నివేదించారు. సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించిన వెంటనే కమిటీ ఏర్పాటు చేసి, సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక సమర్పిస్తామని కృష్ణాబోర్డు పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top