
వాహన పూజలకు ప్రత్యేకంగా నిలుస్తున్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం
సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వాహన పూజల నిర్వహణ
ఇక్కడ పూజ చేస్తే ఎలాంటి ఆటంకాలు కలగవని నమ్మకం
రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం ఇస్తున్న భక్తులు
మల్యాల: ఆపదలో అభయాంజనేయస్వామిగా భక్తులకు అండగా నిలుస్తూ, కోరిన కోర్కెలు తీర్చుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం రాష్ట్రంలో వాహనాల పూజలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకొని, వాహన పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. సామాన్యుల నుంచి మొదలుకొని, ప్రముఖుల వరకు కొండగట్టులోనే తమ వాహనాల పూజ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఏటా వాహన పూజల భక్తుల సంఖ్య పెరుగుతోంది.
మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది తరలి వస్తుండటంతో నిత్యం కొండగట్టు భక్తులతో కిటకిటలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి మంగళ, శనివారాల్లో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతోపాటు, నూతనంగా వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తూ, వాహన పూజలు చేసుకుంటున్నారు.
మంగళ, శనివారాల్లో..
కొండగట్టులో నిత్యం వాహన పూజలతోపాటు ప్రతి మంగళవారం, శనివారాల్లో నూతన వాహనాలకు వాహనదారులు పూజలు చేసుకుంటారు. రాష్ట్రవ్యా ప్తంగా హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వాహనాల కొనుగోలు అనంతరం స్వామివారిని దర్శించుకొని, వాహన పూజలు చేస్తుంటారు. ప్రతి వాహనానికి ఒక్కసారి అయినా అంజన్న సన్నిధిలో పూజ నిర్వహించాలని ఏటా వేలాదిమంది వాహనదారులు కొండగట్టులో తమ వాహనాలకు పూజలు నిర్వహిస్తున్నారు. కొండగట్టులో ఏటా దసరా పండుగ రోజు వేలాది మంది వాహనదారులు తమ వాహనాలకు పూజలు చేసుకుంటారు.
ఆంజనేయస్వామి అభయహస్తం..
శ్రీరాముడికి వాహనం హనుమంతుడు.. ఎక్కడికి వెళ్లినా తిరుగులేని కార్యాలు సాధించిన ఘనుడు హనుమంతుడు. ఈ నేపథ్యంలో వాహనాలకు ఎటువంటి ఆటంకాలు, ప్రమాదాలు కలుగవని, శుభాలు కలుగుతాయనే విశ్వాసంతో భక్తులు తమ వాహనాలను కొండగట్టులో పూజలు నిర్వహిస్తుంటారు. చొప్పదండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన వాహనానికి కూడా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తన ఎన్నికల ప్రచారం కోసం కొనుగోలు చేసిన వారాహి వాహనానికి కొండగట్టులోనే పూజలు చేయించడం కొండగట్టు ప్రత్యేకతకు అద్దం పడుతోంది.
ఏటా రూ.20 లక్షల ఆదాయం
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వాహన పూజలు నిర్వహించుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపుతుండటంతో ఏటా వాహన పూజ ఆదాయం పెరుగుతోంది. వాహన పూజల ద్వారా సుమారు రూ.20 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతోంది. వాహనదారుల సౌకర్యం కోసం, స్వామివారి ఉచిత గర్భగుడి ప్రవేశం కల్పించి, స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తే, రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది వాహనదారులు కొండగట్టులో వాహన పూజలతోపాటు, స్వామివారిని దర్శించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

వాహనదారులకు అభయం
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నూతన వాహనాలతో పాటు ఏటా ప్రతి దసరా పండుగకు ఉపయోగించే వాహనాలకు కూడా పూజలు నిర్వహిస్తుంటారు. కొండగట్టులో వాహనాలకు పూజలు నిర్వహిస్తే, ఆంజనేయస్వామి అభయం ఇస్తారని, ఎటువంటి ప్రమాదాలు జరుగవని భక్తుల విశ్వాసం. వాహన పూజల కోసం రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చి, తమ వాహనాలకు పూజలు చేసుకుంటున్నారు. – రామకృష్ణ, కొండగట్టు ఆలయ ప్రధాన అర్చకుడు
స్వామివారి గర్భగుడి దర్శనం కల్పించాలి
కొండగట్టులో వాహన పూజలకు వచ్చే భక్తుల కుటుంబాలకు స్వామివారి గర్భగుడి ప్రవేశం కల్పించాలి. ఏటా వాహనాలకు స్వామి సన్నిధిలో పూజలు నిర్వహిస్తాం. వాహన పూజకు ముందు స్వామివారి దర్శనం కోసం వెళ్లడంతో క్యూ లైన్లలో నిలబడటంతో జాప్యం జరుగుతోంది. వాహనపూజలు చేసుకునే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని స్వామివారి గర్భగుడి దర్శనం కల్పించాలి. – కొక్కుల రఘు, మల్యాల