సాక్షి, రంగారెడ్డి జిల్లా: పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణ, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో మొక్కల పెంపకం అత్యంత కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గుర్రంగూడ అటవీ ప్రాంతంలో నిర్వహించిన వనమహోత్సవం–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
వనమహోత్సవాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం 1950లో ప్రజా ఉద్యమంగా ప్రారంభించిందని గుర్తు చేసిన మంత్రి, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో వనమహోత్సవాన్ని మహా ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు గత రెండు సంవత్సరాలుగా వనమహోత్సవ కార్యక్రమాలకు అపూర్వ స్పందన అందించారని, "ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క" అనే ముఖ్యమంత్రి పిలుపు రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ చైతన్యాన్ని పెంచి, పచ్చదనం పెంపు దిశగా సమాజాన్ని ప్రేరేపించిందని అన్నారు.
మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడాది నాటిన మొక్కలలో 94 శాతం మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 13,242 నర్సరీలలో సిద్ధం చేసిన 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
గుర్రంగూడ అటవీ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి, అటవీ శాఖ పట్టుదలకు, న్యాయపరమైన విజయానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో సుమారు 102 ఎకరాల అటవీ భూమి తిరిగి అటవీ శాఖకు లభించిందని, అనంతరం మొత్తం 424 ఎకరాల 31 గుంటల భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించినట్లు తెలిపారు. ఇది తెలంగాణ అటవీ సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు.


