
సూచనలిస్తున్నానంటూనే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు
తానే పదేళ్లు సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలకు బహిరంగంగానే ఖండన
పార్టీలో తొలిసారిగా విన్పించిన అసంతృప్త స్వరంతో కాంగ్రెస్‌లో కలకలం
ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలంటూ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు
మంత్రి పదవి గురించేనా?.. దీర్ఘకాలిక వ్యూహం ఉందా? అనే చర్చ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం వ్యాఖ్యలను, ఆయన వైఖరిని తప్పుపడుతున్న రాజగోపాల్‌రెడ్డి.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, సూచనలు మాత్రమే చేస్తున్నానంటూనే తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తున్నారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను ఇటీవల బహిరంగంగానే ఖండించారు. అంతేకాదు సమయం వచ్చినప్పుడల్లా రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేలుస్తుండటం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
పార్టీ విధానాలకు వ్యతిరేకమంటూ..
పాలమూరు జిల్లాలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగా ఖండించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 19 నెలల తర్వాత తొలిసారి పార్టీలో అసంతృప్త స్వరాన్ని వినిపించారు. ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని, తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని, ఈ వ్యాఖ్యలను నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరనే కోణంలో ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.
రాజగోపాల్ వ్యాఖ్యలు అప్పట్లోనే కాంగ్రెస్ శిబిరంలో చర్చకు తెరలేపాయి. వాటి వెనుక ఆంతర్యమేంటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ ఎపిసోడ్ మరుగునపడుతోందనుకునే లోపే రాజగోపాల్ మరోమారు మరింత ఘాటైన విమర్శలు చేశారు. సోషల్ మీడియా గురించి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఆ తర్వాత బుధవారం కూడా అదే వైఖరి కొనసాగించారు.
తనను కలిసిన డిజిటల్ మీడియా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ప్రతిపక్షాలను ఉద్దేశించి వాడుతున్న భాషను మార్చుకోవాలని సూచించారు. తాను రేవంత్‌రెడ్డిని విమర్శించడం లేదంటూనే, పార్టీలో జరుగుతున్న తప్పులను చెప్పకపోతే నష్టం జరుగుతుందని, అందుకే చెపుతున్నానంటూ ముక్తాయింపునివ్వడం గమనార్హం.
అధిష్టానాన్నీ వదలకుండా..
రాజగోపాల్‌రెడ్డి అప్పుడప్పుడూ పార్టీ అధిష్టానాన్ని సైతం వదిలిపెట్టకుండా సుతిమెత్తని వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం మాట ఇచ్చిందని చెబుతూ.. భువనగిరి ఎంపీ సీటులో గెలిపించినప్పటికీ అధిష్టానం మాత్రం తన మాట నిలబెట్టుకోవడం లేదంటూ నర్మగర్భంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తుందా లేదా అన్నది వారిష్టమని అంటూనే, మునుగోడు ప్రజల కోసం మళ్లీ త్యాగం చేసేందుకు కూడా వెనుకాడేది లేదంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తుండడం గమనార్హం.
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలన్నిటిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రిపదవి ఇవ్వనందుకే రాజగోపాల్‌రెడ్డి అలా మాట్లాడుతున్నారని కొందరు, మంత్రిపదవి మాత్రమే కాదని దీర్ఘకాలిక వ్యూహంతో ఆయన వెళుతున్నారని, అందుకే రేవంత్ పదేళ్ల సీఎం వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకు ముందుకు వచ్చారని మరికొందరు అంటున్నారు. పార్టీలోని కొందరు నేతలు చేయలేని పనిని ఆయన చేశారని మరికొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
డీకేతో భేటీ..!
రాజగోపాల్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయనతో మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఇరువురు వ్యక్తిగత, రాజకీయ అంశాలపై చర్చించారని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను రాజగోపాల్‌రెడ్డి వివరించారని సమాచారం. కాగా ఈ వ్యవహారంపై గురువారం ఆయనతో మాట్లాడతానని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఢిల్లీలో వ్యాఖ్యానించడం కొసమెరుపు.