కోదాడలో దళిత యువకుడు రాజేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, దళిత సంఘాల చేపట్టిన ధర్నా ముగిసింది. రాజేష్‌ది లాకప్ డెత్ అని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. అతని కుటుంబానికి న్యాయం జరిగేవరకు అంత్యక్రియలు నిర్వహించబోమని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పోలీస్ ఉన్నతాధికారుల హామీతో గురువారం ఉదయం వాళ్లు శాంతించి ఆందోళన విరమించారు.
స్థానిక మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పనిచేసే చడపంగు నరేష్ కొంతమంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అదే పేరుతో ఉన్న ఇతరుల బ్యాంకు ఖాతాల్లో వేయించి సొమ్ము చేసుకున్నాడు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు నరేష్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా చిలుకూరుకు చెందిన కె. రాజేష్ పేరుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును కోదాడకు చెందిన కె.(కర్ల) రాజేష్‌కు ఇచ్చి అతని అకౌంట్ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినట్లు నరేష్ చెప్పాడు. దీంతో..
చిలుకూరు పోలీసులు ఈనెల 9న రాజేష్‌ను అరెస్ట్ చేసి 10న రిమాండ్ విధించడంతో హుజూర్‌నగర్ సబ్ జైలుకు తరలించారు. 14వ తేదీ రాత్రి రాజేష్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిలుకూరు పోలీసులను ఎస్కార్ట్ ఇచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న రాజేష్ మృతిచెందాడు. 17న పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
చిలుకూరు పోలీసులు కొట్టడం వల్లే రాజేష్ మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేసేది లేదని స్పష్టం చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కోదాడలోని కల్లుగడ్డ బజార్‌లో రాజేష్ ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. రాజేష్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.
హైకోర్టులో విచారణ వాయిదా
మరోపక్క రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని దున్న అంబేద్కర్ మంగళవారం హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా.. హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం సాయంత్రం మరోసారి విచారణ చేసి కేసును 15 రోజులపాటు వాయిదా వేసింది. ఈలోపు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని చెప్పింది.


