నీట మునిగిన ‘కేఎల్‌ఐ’ మోటార్లు  | KLI Project First Lift Motors Were Submerged In Water At Mahabubnagar | Sakshi
Sakshi News home page

నీట మునిగిన ‘కేఎల్‌ఐ’ మోటార్లు 

Oct 17 2020 9:04 AM | Updated on Oct 17 2020 9:04 AM

KLI Project First Lift Motors Were Submerged In Water At Mahabubnagar - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్‌ రూరల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) మొదటి లిఫ్ట్‌ మోటార్లు నీట మునిగాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గం కృష్ణానది తీరంలోని ఎల్లూరు వద్ద కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం 1, 3వ మోటార్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మూడో మోటార్‌ నీటిని ఎత్తిపోసే పైపులైన్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల సర్జ్‌పూల్‌ పక్కనే గల భూగర్భంలోని ఐదు మోటార్లు నీట మునిగాయి. లీకేజీ ఏర్పడి నీరు మోటార్లకు వస్తుండగా అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు మొదటి మోటార్‌ను, సాయంత్రం 3.40 గంటలకు మూడో మోటార్‌ను ప్రారంభించారు. మూడో మోటార్‌ ఆన్‌చేసిన 10 నిమిషాల తర్వాత ఆ మోటార్‌ కింద ఉన్న బేస్‌మెంట్‌ బ్లాస్ట్‌ కావడం వల్ల నీళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. లిప్ట్‌లోని 45 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చాయి.

లిఫ్ట్‌లోని ఎనిమిది అంతస్తులతో పాటు ప్యానల్‌ బోర్డు సహా నీట మునిగాయి. ఈ విషయంపై కేఎల్‌ఐ ఎస్‌ఈ అంజయ్యను వివరణ కోరగా.. మోటార్లు లీక్‌ కావడం వల్ల నీరు వచ్చిందని, డీ వాటరింగ్‌ చేస్తామని వివరించారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే వెల్లడిస్తామని తెలిపారు. కాగా కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ వద్ద 2015లో కూడా ఇదే విధంగా మోటార్లు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి రాత్రి    10 గంటల సమయంలో ఘటన జరిగిన ఎల్లూరు వద్ద కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీంచారు.  

సాంకేతిక లోపం వల్లే.. మంత్రి నిరంజన్‌ రెడ్డి 

కొల్లాపూర్‌ రూరల్‌: కేఎల్‌ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్ట్‌లో సాంకేతిక లోపం వల్ల వరద నీరు వచ్చి ఐదు పంపులు మునిగాయని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ సమస్యపై ప్రస్తుతం ఎలాంటి పరిష్కారం దొరకదని, నీటిని డీవాటరింగ్‌ చేస్తే తప్ప.. విషయం చెప్పడానికి వీలుకాదని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి మునిగిపోయిన పంపులను ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాగునీటి కోసం మిషన్‌భగీరథ పథకం అవసరం నిమిత్తం మధ్యాహ్నం 2.54 నిమిషాలకు మొదటి లిఫ్ట్‌లోని మొదటి పంపును ప్రారంభించారు. 3.45 నిమిషాలకు మూడో పంపును ప్రారంభించిన వెంటనే పెద్ద ఎత్తున మోటార్ల శబ్ధం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ సమస్యను సాంకేతిక లోపంగా గుర్తించామని పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement