యూరప్ పర్యటనలోనూ వీడని సస్పెన్స్
ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పును అనుసరించి
ప్లాన్ ‘బి’ అమలుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విదేశీ పర్యటన రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం శనివారం యూరప్ బయలుదేరిన ఆయన, మార్గంమధ్యలో దేశ రాజధాని ఢిల్లీలో ఆగడం చర్చనీయాంశమైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్న తరుణంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆయన అక్కడ కాంగ్రెస్ అధిష్టానంలోని కొందరు కీలక నేతలను కలిసినట్లు సమాచారం. గతంలో బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచిన దానం, అనంతర పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల స్పీకర్ కార్యాలయం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు రావడం, దానికి ప్రతిగా తాను ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేనే’ అని ఆయన బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో.. తదుపరి చట్టపరమైన, రాజకీయ పరిణామాలపై చర్చించడానికే ఢిల్లీ మజిలీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కోర్టు డెడ్‌లైన్.. దానం ‘ప్లాన్ బి’
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై కోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో, ఒకవేళ అనర్హత వేటు పడితే అనుసరించాల్సిన ‘ప్లాన్ బి’పై దానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్
జెండా ఎగురవేసాం‘ అని ఆయన గతంలోనే ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టికెట్ భరోసా, పార్టీ అండదండల కోసం ఆయన ఢిల్లీని వేదికగా చేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఢిల్లీలో తన పని ముగించుకుని ఆయన యూరప్ పర్యటనకు బయలుదేరారు.
పర్యటన అనంతరం కార్యాచరణ..
యూరప్ నుంచి తిరిగి వచి్చన వెంటనే దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ లేదా పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి, దానం నాగేందర్ ఢిల్లీ మజిలీ.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఫిరాయింపుల వ్యవహారంలో ఎటువంటి మలుపులకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.


