మత్తు మందులు..

Key Drugs Are Falling By The Wayside Due To The Negligence Of Drug Control Officials - Sakshi

పక్కదారిపడుతున్న కీలక ఔషధాలు

‘మత్తు’ కోసం వాడుతూ  బానిసలవుతున్న యువత

డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణం

ఎక్కువగా వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు

నిఘా ముమ్మరం చేశామంటున్న పోలీసులు

1956: శస్త్రచికిత్స తదితర సందర్భాల్లో రోగులకు మత్తు కలిగించడం కోసం  శాస్త్రవేత్త పార్కే–డవీస్‌ కెటమ  హైడ్రోక్లోరైడ్‌ను కనుగొన్నాడు.

1969: మత్తుకు బానిసైన వారు ఈ ఇంజెక్షన్‌ను విచ్చలవిడిగా  వినియోగిస్తుండటంతో దీనిని ‘నియంత్రణ మందు’గా మార్చారు.

2011: కెటమైన్‌ నుంచి పొడిని తయారుచేసి నిషా కోసం వాడుతుండటంతో కేంద్రం ఈ పొడిని నిషేధిత మాదకద్రవ్యాల జాబితాలో చేర్చింది.

ప్రస్తుతం.. దీన్ని ఇంట్లోనే తయారుచేస్తూ విక్రయించే ట్రెండ్‌ నడుస్తోంది. 

సాక్షి, హైదరాబాద్‌: ఇదొక్కటే కాదు.. మాదకద్రవ్యాలు కాని ఇలాంటి అనేక మత్తు ‘మందు’లకు యువత బానిసవుతోంది. సాధారణ రుగ్మతలు, శస్త్రచికిత్స చేసిన తర్వాత, అత్యవసర సమయాల్లో వాడే ఔషధాలు పక్కదారి పడుతున్నాయి. వీటిని విక్రయించేందుకు వ్యవస్థీకృత ముఠాలు పుట్టుకొచ్చాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పోలీసులు అంటున్నారు. పట్టుబడిన ఔషధాల్లో కొన్ని మెడికల్‌ షాపులు, డీలర్ల నుంచి బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. మాదకద్రవ్యాలతో పాటు ఈ ఔషధాల దుర్వినియోగంపైనా నిఘా పెట్టారు. ఈ ఔషధాలను ‘మత్తు’ కోసం వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు.

గతంలో విశాఖపట్నంతో పాటు నగరంలోని ఓయూ ఠాణా పరిధిలోనూ కెటమైన్‌ ఇంజెక్షన్లను అక్రమంగా కలిగిన వారిని పోలీసులు అరెస్టుచేశారు. టోలిచౌకి ప్రాంతంలో కెటమైన్‌ ఇంజెక్షన్‌ను వినియోగించి పొడిని తయారుచేయడం వెలుగులోకొచ్చింది. ఈ పొడిని ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకుంటూ మత్తులో జోగుతున్నారు. దీన్ని వినియోగించే వారితో పాటు విక్రయించే వాళ్లు నగరంలో పలువురు ఉన్నారు.

నగరంలో గంజాయికి బానిసైన యువత ప్రస్తుతం నెట్రావిట్‌ టాబ్లెట్స్‌ వాడుతున్నారు. వీటిని మహారాష్ట్ర నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగర పోలీసులు ఇటీవల ఆసిఫ్‌నగర్‌ ప్రాంతంలో ఓ విక్రేతను అరెస్టుచేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. గంజాయిని సిగరెట్లో ఉంచి పీల్చినప్పుడు వెలువడే పొగతో తీవ్రమైన వాసన వెలువడుతుంది. దీంతో అందరి కంట్లో పడుతున్నామని భావిస్తోన్న యువత.. ప్రత్యామ్నాయంగా ‘నెట్రావిట్‌’ మాత్రల్లో మత్తును వెతుక్కుంటోంది. తీవ్ర రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి రాత్రిళ్లు సరిగా నిద్రపట్టక ఇతర రుగ్మతలు వచ్చే ఆస్కారం ఉంది. అందుకనే వైద్యులు వీరికి నెట్రావిట్‌ మాత్రలను ప్రిస్రై్కబ్‌ చేస్తారు. శస్త్రచికిత్స జరిగిన వారికీ ఆ నొప్పి తెలియకుండా ఒకట్రెండు రోజులు వీటిని రాస్తారు. ప్రస్తుతం యువత ఈ ‘మత్తు’ బారినపడటంతో కొందరు మహారాష్ట్ర నుంచి నెట్రావిట్‌ మాత్రల్ని నగరానికి అక్రమ రవాణా చేస్తున్నారు. 15 మాత్రలతో ఉండే స్ట్రిప్‌ ఖరీదు రూ.85 కాగా, గంజాయి బానిసలకు రూ.200కు అమ్ముతున్నారు.

దగ్గు మందులే ఎక్కువ..: ఇటీవల పలువురు విద్యార్థులు, యువకులు ‘సేఫ్‌ డ్రగ్స్‌’ వైపు మొగ్గుచూపుతున్నారు. ఫుట్‌పాత్‌లపై ఉండే వారు సైతం వీటినే వాడుతున్నారు. వీరంతా వాడే వాటిలో దగ్గు మందు ప్రధానమైందని అ«ధికారులు చెబుతున్నారు. ఇంకా ఈ జాబితాలో నిద్రమాత్రలు, వైట్నర్‌ వంటివీ ఉన్నాయి. నిద్రమాత్రల్ని సేకరించడం కొంచెం కష్టం. వైట్నర్‌ను ఖరీదు చేయడం తేలికే అయినా, వాడేటప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలుంటాయి. దీంతో మత్తుకు బానిసలవుతున్న యువత, వైట్నర్‌ లభించని వారు దగ్గు మందును ఎక్కువ వాడుతున్నారు. సాధారణంగా దగ్గు మందుల్ని డెక్స్‌ట్రోమెథార్ఫిన్, కోడైన్‌లతో తయారుచేస్తారు. కోడైన్‌తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్నికేవలం ఔషధాల తయారీకే వినియోగిస్తుంటారు. డెక్స్‌ట్రోమెథార్ఫిన్‌ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలవుతున్నారు. 

కండల కోసం ఇంజెక్షన్‌: అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్‌టెరై్మన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వాడుతోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి, ఎక్కువ బరువులు ఎత్తడానికి ఈ సూది మందును తీసుకుంటోంది. దీన్ని అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠాను ఇటీవల టాస్‌్కఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మెఫన్‌టెరై్మన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రోగులకు సర్జరీలు చేసేటపుడు మత్తు (అనస్థీషియా) ఇస్తారు. ఈ ఇంజెక్షన్‌ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పనిసేలా చూస్తుంది. గుండెపోటు వచ్చిన వారికి ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. కాలక్రమంలో ఈ ఇంజెక్షన్‌ నగరంలో జిమ్‌లకు వెళ్తున్న యువతకు ‘అథ్లెట్స్‌ స్టెరాయిడ్‌’గా మారిపోయింది.

మెడికల్‌ షాపులపై డేగకన్ను: ఇలాంటి ఔషధాలను నిబంధనల ప్రకారం వైద్యుడి చీటీ లేనిదే అమ్మడానికి లేదు. కొందరు అక్రమార్కులు వీటిని ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగరంలోని కొన్ని మెడికల్‌ షాపుల నిర్వాహకులు చీటీ లేకుండానే విక్రయించేస్తున్నారు. కొన్ని రకాలైన ఇంజెక్షన్లు కొరి యర్‌లో ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి వస్తున్నాయి. ఈ నేపథ్యం లో నగరంలోని మెడికల్‌ దుకాణాలు, కొరియర్‌ సంస్థలపై పోలీ సులు డేగకన్ను వేశారు. మెడికల్‌ దుకాణాల నిర్లక్ష్య ధోరణిపైనా డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీస్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు.

మున్ముందు అనారోగ్య సమస్యలు
ఈ మత్తు‘మందుల్ని’, స్టెరాయిడ్స్‌ను వినియోగించే వాళ్లకు తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని వాడే వారిలో విద్యార్థులు, యువతే ఎక్కువగా ఉన్నారు. వీటికి ఒకసారి అలవడితే.. అది దొరక్కపోతే పిచ్చివాళ్లుగా మారిపోతారు. వైద్యులు సైతం అత్యంత అరుదుగా రాసే కొన్ని ఔషధాలను అక్రమంగా వాడటం వల్ల గుండెజబ్బులతో పాటు కిడ్నీ, లివర్, మొదడుతో పాటు నరాల వ్యవస్థ దెబ్బతింటాయి. ఒక్కోసారి గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు పెరిగి తీవ్ర పరిణామాలు ఉంటాయి.  తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలి.
– డాక్టర్‌ పి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి

అమ్మే, కొనేవారిపైనా కేసులు
వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ లేకుండా కొన్ని ఔషధాలను విక్రయించడం నేరం. ప్రధానంగా దగ్గు మందులతో పాటు మత్తును కలిగించే టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వీటి కిందికి వస్తాయి. ఇలాంటివి విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై నిత్యం నిఘా ఉంచుతున్నాం. అమ్మిన వారితో పాటు కొన్న వారిపైనా కేసులు పెడుతున్నాం. ఇప్పటికే ఈ తరహా కేసులు పలు నమోదయ్యాయి. వైట్నర్‌ను మత్తు కోసం వాడుతున్నారనే సమాచారం ఉంది. 
– పి.రాధాకిషన్‌రావు, ఓఎస్డీ, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top