
హైదరాబాద్, సాక్షి: ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు.
‘‘కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli Land Issue) ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం.
దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపాం. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధరించింది. స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి’’ అని కేటీఆర్(KTR) కోరారు.

ఇటీవల హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని.. ఇదే కాంగ్రెస్ పాలనని వ్యాఖ్యానించారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్ మర్చిపోయిందని మోదీ ఎద్దేవా చేశారు.