కరోనాకు ధైర్యమే మందు అంటూ...

Kanaka Dhara Apartment People Stand Unity Against Corona Fight - Sakshi

హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మూసాపేట డివిజన్‌ మోతీనగర్‌ కనకధార గోల్డ్‌ అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అపార్టుమెంట్‌ వాసులంతా కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తూ మహమ్మారి కట్టడికి సమష్టిగా కృషి చేస్తున్నారు. కరోనాకు ధైర్యమే మందు అంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ తోడ్పాటునందించుకుంటున్నారు. 

అపార్టుమెంట్‌ పరిసరాలతో పాటు ఫ్లాట్లను నిత్యం శానిటైజేషన్‌ చేస్తున్నారు.   అపార్టుమెంట్‌ గేట్‌ వద్ద శానిటైజర్‌ను ఏర్పాటు చేసి అపార్టుమెంట్‌కు వచ్చే వారు చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు.  మాస్కు ధరిస్తేనే అపార్టుమెంట్‌లోకి పంపిస్తున్నారు.  ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్కీనింగ్‌ చేస్తున్నారు.  అపార్టుమెంట్‌ వాసులకు కావాల్సిన సరుకులను డెలివరీ బాయ్‌ తీసుకువస్తే వాటిని సెక్యూరిటీ వారు శానిటైజ్‌ చేసి యజమానులుకు అందజేస్తున్నారు.  

ఎవరికైనా కరోనా లక్షణాలు బయట పడితే వారికి ధైర్యం చెబుతూ వైద్యులను సంప్రదించి మందులు తీసుకొచ్చి ఇస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ఆహారం వండిపెట్టేందుకు ఎవ్వరూ లేకపోతే ఆహారం కూడా అందిస్తున్నారు.  అపార్టుమెంట్‌లో ఉండేవారిని కలిసేందుకు కుటుంబసభ్యులు, బంధు,మిత్రులు వస్తే ఫోన్‌ ద్వారా సంప్రదించి బయటే మాట్లాడి పంపిస్తున్నారు. 

ఏదో జరిగిపోద్దని ఊహించుకోరాదు 
కరోనా పాజిటివ్‌ అనగానే ఎవ్వరూ అధైర్య పడకూడదు. ధైర్యంగా ఉంటూ వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలి. ఏదో జరిగిపోద్దని ఊహించుకుంటూ ఆందోళన చెందరాదు. మా అపార్టుమెంట్‌లో కొంతమందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారికి వైద్యుల సలహా మేరకు మందులు అందజేసి ధైర్యం చెప్పా. వారు కోలుకున్నారు. మా అపార్టుమెంట్‌ను తరచూ శానిటైజేషన్‌ చేయిస్తూ  తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.           
 –నలమాల్పు అంజిరెడ్డి, అపార్టుమెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top