మంజీర నదిపై భారీ వంతెన నిర్మాణం.. కానీ.. | Kamareddy, Medak Districts Connecting Bridge on Manjeera River Works At Snail Pace | Sakshi
Sakshi News home page

మంజీర నదిపై భారీ వంతెన నిర్మాణం.. కానీ..

Oct 3 2022 3:43 PM | Updated on Oct 3 2022 3:46 PM

Kamareddy, Medak Districts Connecting Bridge on Manjeera River Works At Snail Pace - Sakshi

వంతెన అవతల పొలాలు

కామారెడ్డి, మెదక్‌ జిల్లాల మధ్యన దూరభారాన్ని తగ్గించేందుకు మంజీర నదిపై చేపట్టిన భారీ వంతెన, కామారెడ్డి జిల్లాలో రెండు వరుసల రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ..

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, మెదక్‌ జిల్లాల మధ్యన దూరభారాన్ని తగ్గించేందుకు రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టిన మంజీర నదిపై భారీ వంతెన, కామారెడ్డి జిల్లాలో రెండు వరుసల రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ మెదక్‌ జిల్లా పరిధిలో (వంతెన అవతల) రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ రోడ్డు అందుబాటులోకి కానీ 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. ఇరు జిల్లాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. 2015లో వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని తాండూర్‌ గేట్‌ నుంచి తాండూరు, వెంకంపల్లి మీదుగా వంతెన వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.21 కోట్లు మంజూరు చేశారు. 


రోడ్డు నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు కోర్టుకు వెళ్లడంతో కొంత కాలం పనులు జరగలేదు. పరిహారం ఇచ్చిన తరువాత పనులు చేపట్టారు. అటవీ వివాదంతో కొద్దిమేర పనులు ఆగిపోయినా మిగతా పనులు దాదాపు పూర్తయ్యాయి. మంజీర మీద భారీ  వంతెన అందుబాటులోకి వచ్చింది. కానీ వంతెన అవతల రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి నిత్యం ఎంతో మంది వెళుతుంటారు. రోడ్డు అందుబాటులోకి వస్తే రాకపోకలు సులువవుతాయి.  

తగ్గే దూరం 40 కిలోమీటర్లు.. 
కామారెడ్డి జిల్లా వాసులు ముఖ్యంగా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట తదితర మండలాల ప్రజలు మెదక్‌ జిల్లాలోని పాపన్నపేట మండలానికి వెళ్లాలంటే మెదక్‌ మీదుగా దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అయితే తాండూర్‌ గేట్‌ నుంచి తాండూర్, వెంకంపల్లి మీదుగా మంజీరపై నిర్మించిన వంతెన ద్వారా మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలోని మగ్దుంపూర్‌ మీదుగా పాపన్నపేటకు వెళ్లడానికి కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. అంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. మంజీర మీద వంతెన లేక ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడు వంతెన పూర్తయ్యింది. కానీ మెదక్‌ జిల్లాలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి.  (క్లిక్: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!)

నిధులు మంజూరైతేనే... 
మంజీర వంతెన నుంచి మగ్దుంపూర్‌ మీదుగా పాపన్నపేట వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఫార్మేషన్‌ రోడ్డు కూడా లేదు. పొలాల మధ్య నుంచి బండ్లబాట ఉంది. రోడ్డు నిర్మాణానికి ముందుగా రైతుల నుంచి భూసేకరణ జరపాలి. ఆ తర్వాత రోడ్డు పనులు చేపట్టా­ల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం కోసం మెదక్‌ జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. (క్లిక్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?)

రూ.33 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం.... 
కామారెడ్డి, మెదక్‌ జిల్లాల మధ్య దూరం మధ్య దూరం తగ్గించే రహదారిని పూర్తి చేయాలని జెడ్పీ మీటింగుల్లో ప్రతిసారీ అడుగుతున్నాం. ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించాం. అయినా ప్రయోజనం లేదు. రూ.33 కోట్లతో వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తయినా, మెదక్‌ జిల్లాలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ఏడుపాయల, మెదక్‌ చర్చి, పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యానికి పర్యాటకులు పెరుగుతారు. 
– యు.మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, నాగిరెడ్డిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement