చీతా, జాగ్వార్, మయూఖా, రుద్రమ... ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు..

New Names For TSRTC New Buses Whatsapp Group For Suggestions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు రాబోతున్నాయి. ఈ ఏడాది చివరలో కొనే కొత్త బస్సులకు పేర్లు పెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలిసారి స్లీపర్‌ బస్సులు సమకూర్చుకుంటున్న ఆర్టీసీ ... ప్రయాణికులకు  చేరువయ్యేందుకు వాటికి ఆకర్షణీయమైన పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఏడాది చివరికి మొత్తం 630 కొత్త బస్సుల రాక మొదలువుతుంది. డిసెంబరులో వీటి సరఫరా ప్రారంభమై మార్చి వరకు పూర్తిగా అందుతాయి. వీటి ల్లో 16 ఏసీ స్లీపర్‌ బస్సులున్నాయి. మిగతావి సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు. అద్దె  రూపంలో నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీమియం కేటగిరీలో గరుడ, గరుడప్లస్, రాజధాని పేరుతో బస్సులున్నాయి.

ఇప్పుడు ఏసీ స్లీపర్, నాన్‌ ఏసీ స్లీపర్, సూపర్‌ లగ్జరీ కేటగిరీ సర్వీసులకు  పేర్లు పెట్టాలని అధికారులు నిర్ణయించారు.   బస్సులకు ఆకర్షణీయమైన పేర్లు సూచించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. అధికారులను, సిబ్బందిని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచే పేర్లు సూచించటం మొదలైంది. ఇటీవలే భారత్‌కు ఆఫ్రికా చీతాలు రావటంతో వాటి పేరు జనం నోళ్లలో బాగా నానుతోంది. దీంతో ఏసీ స్లీపర్‌ సర్వీసుకు చీతా పేరు పెట్టాలని కొందరు, ప్యారడైజ్‌ ఆన్‌ వీల్స్, డెక్కన్‌ ప్రైడ్, స్వర్ణ రథం, మయూఖా, జాగ్వార్, విహారీ, షీతల శయన, శాతవాహన, కాకతీయ, రుద్రమ, జనతాబస్, విహంగ, హరివిల్లు, రోడ్‌ ఫ్లైట్, మయూర, రాజహంస, అంబారీ, ఉయ్యాల.. ఇలా చాలా పేర్లు సూచించారు. మరిన్ని సూచనలు రానున్నాయి.

వీటిల్లోంచి కొన్నింటిని ఎంపిక చేసి ఆయా సరీ్వసులకు పెట్టనున్నారు. అలాగే వచ్చే సంవత్సరం ఆరంభంలో బ్యాటరీ నాన్‌ ఏసీ బస్సులు కూడా సమకూరనున్నాయి. వాటికి కూడా పేర్లు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు పుష్పక్‌ పేరు­తో ఎయిర్‌పోర్టుకు తిరుగుతున్నాయి. నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులకు పేర్లు పెట్టాల్సి ఉంది.  

కొనసాగుతున్న దసరా ప్రత్యేక బస్సులు.. 
బతుకమ్మ, దసరా పండుగల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ఆదివారం రాత్రి వరకు నగరం నుంచి మూడు వేల బస్సులు ప్రయాణికులను గమ్యానికి చేర్చాయి. రెండో శనివారం, ఆదివారం సెలవురోజులు కావటంతో భారీగా జనం ఊళ్లకు తరలివెళ్లారు. శనివారం షెడ్యూల్‌ ప్రకారం 560 బస్సులు నడపాల్సి ఉండగా, రద్దీ ఎక్కువగా ఉండటంతో 820 బస్సులు నడిపారు. ఆదివారం 565 బస్సులు నడపాల్సి ఉండగా, 765 బస్సులు తిప్పారు. మంగళవారం మళ్లీ రద్దీ ఎక్కువగా ఉండనున్నందున వేయి బస్సులు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top