మూడు సంపుటాలు.. వేయి పేజీలు | Kaleshwaram Report to be submitted to CM Revanth On 1st August | Sakshi
Sakshi News home page

మూడు సంపుటాలు.. వేయి పేజీలు

Aug 1 2025 6:18 AM | Updated on Aug 1 2025 6:18 AM

Kaleshwaram Report to be submitted to CM Revanth On 1st August

రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ‘కాళేశ్వరం’ నివేదిక 

ఇరిగేషన్‌ ముఖ్య కార్యదర్శికి సమర్పించిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ 

బరాజ్‌ల వైఫల్యానికి అంశాల వారీగా బాధ్యుల గుర్తింపు..! 

నేడు సీఎం ముందుకు నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ గురువారం తన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు సీల్డ్‌ కవర్‌లో నివేదికను అందజేశారు. మూడు సంపుటాల్లో నివేదికను సిద్ధం చేశారు. 650కిపైగా పేజీలతో ప్రధాన నివేదిక అందజేసినట్లు జస్టిస్‌ ఘోష్‌ పేర్కొనగా.. అనుబంధాలతో కలిపి మొత్తం మూడు సంపుటాలుగా ఇచ్చిన నివేదికలో వెయ్యికిపైగా పేజీలునున్నట్లు సమాచారం. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘో‹Ùతో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  

బాధ్యులు వారేనా? 
బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఎస్‌ఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లను కమిషన్‌ ప్రశ్నించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల స్థల ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్‌ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్‌లు విచారణ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇచ్చారు. 

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన కమిషన్‌.. ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా ప్రశ్నలను సంధించింది. విచారణ చివర్లో మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయాల ఆధారంగానే బరాజ్‌ల నిర్మాణ పనులు జరిగాయని మాజీ మంత్రులిద్దరితోపాటు కేసీఆర్‌ కమిషన్‌ ఎదుట వాగ్మూలం ఇచ్చారు. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదనలను ఖండిస్తూ అసలు గత ప్రభుత్వంలోని జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు జరగలేదని తేలి్చంది. దీనికి సమర్థనగా గత ప్రభుత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశాలకు సంబంధించిన తీర్మానాల ప్రతులతో కమిషన్‌కు నివేదిక అందించింది. బరాజ్‌లకు సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారనే అంశాన్ని నిర్ధారించడానికి ఈ నివేదిక కీలకం కానుంది. 

ప్రధానంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్‌ స్థల మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారనే అంశంపై కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సందర్భంగా పలువురు సాక్షులను ప్రశ్నించింది. చాలా మంది సాక్షులు దీనికి సమాధానంగా ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌ల పేర్లను ఉటంకించారు. విచారణకు హాజరైన సాక్షుల్లోనే పలువురి పాత్రపై ఆధారాలను సేకరించిన కమిషన్‌.. వారినే బాధ్యులుగా నిర్ధారిస్తూ నివేదికలో పొందపరిచినట్లు సమాచారం.  

నేడు సీఎంకు నివేదిక.. 
జస్టిస్‌ ఘోష్‌ గురువారం సమర్పించిన నివేదిక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చేరగా.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆ నివేదికను అందచేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం నివేదికను మీడియాకు బహిర్గతం చేయనున్నట్లు తెలిపారు. 

అంశాలకు కట్టుబడే నివేదిక.. జస్టిస్‌ ఘోష్‌ 
ప్రభుత్వం కమిషన్‌కు నిర్దేశించిన అంశాలకే పరిమితమై నివేదికను సిద్ధం చేసినట్లు జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి సిఫారసులు చేయలేదని మీడియాకు తెలియజేశారు. సర్కారుకు నివేదిక అందించడంతో తన బాధ్యత తీరిందన్నారు. ఇకపై కమిషన్‌ కార్యకలాపాల కోసం హైదరాబాద్‌కు రానన్నారు. సర్కారు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించగా అది తనకు తెలియదన్నారు.  

బాధ్యులెవరు? ప్రజాధన దుర్వినియోగం ఎంత? 
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగించిన తీరు, చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు తీరు/ఉల్లంఘనలతోపాటు వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించారా లేదా? వంటి అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ అంశాలు, నిర్మాణ సంస్థలు/కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం, ఇతర అవకతవకతలపై విచారణ జరపాలని కోరింది. 

అసమంజస రీతిలో ఒప్పందాల గడువు పొడిగింపు, పనులు పూర్తయినట్లు తప్పుడు సరి్టఫికేట్ల జారీ, గడువు పూర్తికాక ముందే బ్యాంక్‌ గ్యారెంటీల విడుదల, తదితర చర్యలతో నిర్మాణ సంస్థలు/కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించిన వ్యవహారంపై విచారణ జరిపి సంబంధిత అధికారులు/సంస్థలను బాధ్యులుగా నిర్ధారించాలని సూచించింది. అంశాలవారీగా బాధ్యులను గుర్తించడంతోపాటు దుర్వినియోగమైన నిధులను కమిషన్‌ నిర్ధారించి నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement