
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం.. రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కాగా, ఈఈ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేయగా.. స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు సీజ్, విల్లాలు, బయటపడ్డాయి.
శ్రీధర్ నివాసం, కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేటలో ప్లాట్, కరీంనగర్‌లో 3 ఓపెన్ ప్లాట్లు, అమీర్‌పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో 3 ఇండిపెండెంట్ హౌస్‌లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో 19 ఓపెన్ ప్లాట్‌లు ఉన్నట్టు తేలింది.
రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వలు తనిఖీల్లో బయటపడ్డాయి. శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ నిర్ధారించింది. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీధర్ ఎస్‌ఆర్‌ఎస్పీ డివిజన్-8లో ఈఈగా పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.