
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of Telangana High Court) జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా హైకోర్టు చీఫ్ జస్టిస్‌లుగా ఇప్పటి వరకు ఆరుగురు పనిచేశారు. త్రిపుర హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ ఏకే సింగ్ ఏడో చీఫ్ జస్టిస్. హైకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 42 కాగా ప్రస్తుతం 26 మంది పనిచేస్తున్నారు. ఇద్దరు జడ్జీల బదిలీ.. ఒకరి చేరికతో ఆ సంఖ్య 25కు చేరింది.

జస్టిస్ ఏకే సింగ్ పూర్తి పేరు అపరేష్ కుమార్ సింగ్. బీహార్‌లో1965 జూలై 7వ తేదీన జన్మిచారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా చేశారు. 1990లో వకీల్‌గా పేరు నమోదు చేసుకుని.. మొదట పాట్నా(బీహార్) హైకోర్టులో, తరువాత ఝార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.

న్యాయ సేవలో..
2012 జనవరి 24: ఝార్ఖండ్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియామకం
2014 జనవరి 16: పర్మనెంట్ జడ్జిగా ప్రమోషన్
2022 డిసెంబర్ – 2023 ఫిబ్రవరి: ఝార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్
2023 ఏప్రిల్ 17: త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం
2025 జూలై: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు