జేపీఎస్‌ల సమ్మె ఉధృతం!

JPS strike escalated in Telangana - Sakshi

నేటి నుంచి వినూత్న పద్ధతుల్లో నిరసనలు 

జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు 

రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సర్పంచ్‌ల సంఘీభావం 

నేటి మధ్యాహ్నంలోగా జేపీఎస్‌లు విధుల్లో చేరాలన్న సీఎస్‌ 

15 రోజులుగా సమ్మెతో గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు! 

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్, ఔట్‌ సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌/ఓపీఎస్‌) సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. తమ సర్వీసు రెగ్యుల రైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటిదాకా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపిన జేపీఎస్‌లు, ఇకముందు ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేయనున్నారు. వినూత్న పద్ధతుల్లో నిరసనలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామస్తుల నుంచి వీరికి మద్దతు పెరుగుతోంది.

మరోవైపు ఓ మహిళా జేపీఎస్‌ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన ఉద్యోగం ఇక పర్మినెంట్‌ కాదనే బెంగతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని జేపీఎస్‌లు చెబుతున్నారు. ఇదిలాఉండగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నిరసన కార్యక్రమాలు వరుసగా 15వ రోజు శుక్రవారం కూడా కొనసాగాయి.

శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడి, ర్యాలీ తీసి ప్రదర్శనలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘భద్రాద్రి రామయ్యా.. రెగ్యులరైజేషన్‌ జీవో ఇప్పించయ్యా’ అనే బ్యానర్‌ను ప్రదర్శిస్తూ గోదావరి నదిలో దిగి నిరసన తెలిపారు. కాగా 15 రోజులుగా జేపీఎస్‌లు విధులకు గైర్హాజరు అవుతుండటంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి.
  
తొమ్మిది వేల మందికిపైగా సమ్మెలోనే.. 

రాష్ట్రంలోని మొత్తం 12,769 పంచాయతీలకు గాను మూడువేల మందికిపైగా పంచాయతీ కార్యదర్శులు (పర్మినెంట్‌ ఉద్యోగులు) ఉన్నారు. మిగతా 9,350 గ్రామపంచాయతీల్లో 8 వేలకుపైగా జేపీఎస్‌లు, వెయ్యిమంది దాకా ఓపీఎస్‌లు విధులు నిర్వహిస్తున్నారు. గతనెల 11వ తేదీతో దాదాపు 6వేల మంది జేపీఎస్‌లు నాలుగేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ను పూర్తి చేసుకున్నారు.

ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియపై ప్రభుత్వపరంగా ఎలాంటి కసరత్తు మొదలెట్టకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో తమ సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలంటూ సమ్మె నోటీస్‌ ఇవ్వడంతో పాటు గత నెల 28 నుంచి సమ్మె ప్రారంభించారు. వీరితో పాటు మిగతా జేపీఎస్‌లు, ఓపీఎస్‌లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు.  

టర్మినేషన్‌ హెచ్చరికలు బేఖాతర్‌.. 
గత మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హెచ్చరించారు. దీంతో అయిదారు వందల మంది జేపీఎస్‌లు తిరిగి విధుల్లో చేరినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వారిలో పలువురు తిరిగి సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

జేపీఎస్‌ల డిమాండ్ల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానంపై స్పష్టత లేకపోవడం, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే చట్ట, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ఉద్దేశంతో సమ్మె చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రామాల్లో కీలక విధులు నిర్వర్తించే కార్యదర్శులపై ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలు వ్యతిరేకతకు దారితీయవచ్చనే ఆందోళన కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ఏ హామీ లభించినా సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేపీఎస్‌లు చెబుతున్నారు.  
సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం గోదావరిలో దిగి నిరసన తెలుపుతున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు. అనంతరం భద్రాద్రి రామయ్యకు వినతిపత్రం సమర్పించారు.   – భద్రాచలం అర్బన్‌ 

అన్ని పనులకూ వారే..  
గ్రామాల్లో దాదాపు అన్ని పనులు పంచాయతీ కార్యదర్శుల ద్వారానే జరుగుతుంటాయి. రోజువారీ పారిశుధ్యం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధిత పనులన్నీ పర్యవేక్షిస్తుంటారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ సర్టిఫికెట్లు, ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు, మ్యుటేషన్ల జారీ వంటి అనేక విధులను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం వీరి సమ్మెతో గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడ పేరుకుపోతున్నాయి. జేపీఎస్‌ల స్థానంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కారోబార్లు, సెర్ప్‌ సిబ్బంది, ఇతర గ్రామ స్థాయిల్లోని కాంట్రాక్ట్, ఇతర విధులు నిర్వహిస్తున్న వారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం కనిపించడం లేదని అంటున్నారు.

మరోపక్క ఉద్యోగ ఆందోళనతోనే జేపీఎస్‌ సోనీ ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు.. జేపీఎస్, ఓపీఎస్‌లు ఆత్మస్థైర్యం కోల్పోయి తీవ్రమైన చర్యలకు దిగొద్దని తెలంగాణ పంచాయత్‌ సెక్రటరీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సోని ఆత్మహత్య దురదృష్టకరమని, ఆమె మొన్నటి దాకా సమ్మెలో పాల్గొని మళ్లీ ఉద్యోగంలో చేరిందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్‌ తెలిపింది.  

జేపీఎస్‌ల డిమాండ్లు ఇవీ.. 
– సర్వీసుల క్రమబద్ధీకరణ జీవో జారీచేయాలి.  
– నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీసుగా పరిగణించాలి.  
– ఔట్‌ సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్‌లుగా ప్రమోట్‌ చేయాలి.  
– వారు పనిచేసిన కాలాన్ని ప్రొబేషన్‌గా పరిగణించి పర్మినెంట్‌ చేయాలి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top